నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు

ABN , First Publish Date - 2022-09-26T06:42:28+05:30 IST

నిబద్ధతతో పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు
జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర దంపతులను సత్కరిస్తున్న మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు సత్యవతి, మాధవి, జడ్పీటీసీ సభ్యులు

జడ్పీటీసీ సభ్యుల సత్కార సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

 

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):


నిబద్ధతతో పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, సభ్యులుగా పదవీ ప్రమాణం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం జడ్పీహాలులో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బూడి మాట్లాడుతూ పీటీజీ తెగలకు తగిన గుర్తింపును ఇవ్వాలనే యోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముంచంగిపుట్టు జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన జల్లిపల్లి సుభద్రను జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలో సుభద్ర పంచాయతీరాజ్‌శాఖపై పట్టు సాధించారన్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన తరువాత పాలనకు సంబంధించి అధికారులు, సిబ్బంది సలహాలు తీసుకున్నానన్నారు. ఏడాది పాలనలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యీలు, జడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాదిలో అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీ నిధుల నుంచి సభ్యులకు రూ.15 లక్షల చొప్పున కేటాయించామన్నారు.  జడ్పీలో బదిలీలు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. భవిష్యతులో మరింత మెరుగైన పాలన అందిస్తానని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అనకాపల్లి, అరకు ఎంపీలు డాక్టరు బి.సత్యవతి, గొడ్డేటి మాధవి, పలువురు జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ అందరినీ సమన్వయంచేసుకుని సుభద్ర మంచి పాలన సాగిస్తున్నారన్నారు. గతానికి భిన్నంగా సభ్యులను సత్కరించడం కొత్త సంప్రదాయమని అభినందించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర దంపతులు, జడ్పీటీసీ సభ్యులను మంత్రి, ఇతర అతిథులు సత్కరించారు. పంచాయతీరాజ్‌ ఉద్యోగుల సంఘం తరపున సత్తిబాబు, సీతారామరాజు కూర్మారావు తదితరులు సభ్యులందరినీ సత్కరించారు. కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, జడ్పీ వైస్‌చైర్మన్‌ తుంపాల అప్పారావు, జీసీసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి, తదితరులు పాల్గొన్నారు. 

Read more