పెద్దేరులో మునిగి యువతి మృతి

ABN , First Publish Date - 2022-09-28T06:37:28+05:30 IST

మండలంలోని సత్యవరం గ్రామ సమీపాన పెద్దేరు నదిలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు జారి పడి యువతి మృతి చెందింది.

పెద్దేరులో మునిగి యువతి మృతి
మృతి చెందిన శివకుమారి

మాడుగుల రూరల్‌, సెప్టెంబరు 27 : మండలంలోని సత్యవరం గ్రామ సమీపాన పెద్దేరు నదిలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు జారి పడి యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... సత్యవరం గ్రామానికి  చెందిన తాడి శ్రీను, వరలక్ష్మి దంపతుల కుమార్తె తాడి శివకుమారి(19) పదో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దనే ఉంటోంది. తండ్రి శ్రీను వ్యవసాయ కూలీ కాగా తల్లి వరలక్ష్మి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మథ్యాహ్న భోజన పథకంలో వంటలు వండుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో శివకుమారి బట్టలు ఉతికేందుకు సమీపాన గల పెద్దేరు నది వద్దకు వెళ్లింది. బట్టలు ఉతుకుతూ కాలుజారి ప్రమాదవశాత్తు ఏటి ప్రవాహంలో పడిపోయింది. వర్షాలు పడడంతో ఏటిలో నీరు జోరుగా పారుతోంది. అంతేకాకుండా లోతు ఎక్కువగా గొయ్యిగా ఏర్పడిన ప్రదేశంలో శివకుమారి మునిగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఊర్లో వారికి చెప్పారు. దీంతో గ్రామస్థులు మాడుగుల అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలించి శివకుమారిని గుర్తించి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే శివకుమారి మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  మాడుగుల ఎస్‌ఐ దామోదరనాయుడు తెలిపారు. చేతికందొచ్చిన కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం


పాయకరావుపేట రూరల్‌, సెప్టెంబరు 27 : మండలంలో కేశవరం నుంచి వెంకటనగరం వైపు వెళ్లే రోడ్డుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మంగళవారం పాయకరావుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలో కేశవరం వద్ద ఉన్న డెక్కన్‌ కెమికల్‌ పరిశ్రమలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రమేష్‌సింగ్‌ అనే వ్యక్తి లేబర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పరిశ్రమను ఆనుకుని కేశవరం నుంచి వెంకటనగరం గ్రామానికి వెళ్లే రోడ్డుపై రమేష్‌సింగ్‌ నడిచివెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న తుని పట్టణానికి చెందిన కీర్తి శ్రీనుకి తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకోగా, 108 వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాఽథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎస్‌.రమేష్‌ తెలిపారు. 

Updated Date - 2022-09-28T06:37:28+05:30 IST