-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » YCP aims to create jobs for the unemployed-NGTS-AndhraPradesh
-
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వైసీపీ లక్ష్యం
ABN , First Publish Date - 2022-04-24T07:06:23+05:30 IST
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాన్ని కల్పించడమే ప్రభుత్వ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. భవిష్యత్‌లో కూడా జాబ్ మేళాలను నిర్వహిస్తామన్నారు. ఈ జాబ్ మేళాలో 208 కంపెనీలు పాల్గొంటున్నాయని, వేలాది మంది నిరుద్యోగులు హాజరవుతున్నారన్నారు. అవసరమైతే సోమవారం కూడా జాబ్‌మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించాల్నది తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశయాన్ని విజయసాయి రెడ్డి భుజస్కందాలపై పెట్టుకుని ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారని వివరించారు. నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఏయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ అక్కరమాని విజయ నిర్మల, జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, మిలీనియం సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాబ్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన పలు విభాగాలను విజయసాయిరెడ్డి పరిశీలించారు.