యూఎల్‌సీ భూములకు రెక్కలు

ABN , First Publish Date - 2022-12-07T00:45:55+05:30 IST

కేఆర్‌ఎం కాలనీలోని పార్కు సమీపంలో గల యూఎల్‌సీ భూమిలో ఇళ్ల నిర్మాణానికి జీవీఎంసీ ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చేసింది...అలాగే మద్దిలపాలెం సినిమా థియేటర్‌ సమీపంలో గల యూఎల్‌సీ స్థలంలో బహుళ అంతస్థుల భవనం లేచింది....శివాజీపాలెం, పెదవాల్తేరు సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గల యూఎల్‌సీ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి.

యూఎల్‌సీ  భూములకు రెక్కలు

(విశాఖపట్నం-ఆంరఽధజ్యోతి)

కేఆర్‌ఎం కాలనీలోని పార్కు సమీపంలో గల యూఎల్‌సీ భూమిలో ఇళ్ల నిర్మాణానికి జీవీఎంసీ ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చేసింది...అలాగే మద్దిలపాలెం సినిమా థియేటర్‌ సమీపంలో గల యూఎల్‌సీ స్థలంలో బహుళ అంతస్థుల భవనం లేచింది....శివాజీపాలెం, పెదవాల్తేరు సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గల యూఎల్‌సీ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి.

పట్టణ భూగరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఆక్రమణదారులకు వరంగా మారింది. పక్క సర్వే నంబర్లతో రిజిస్ర్టేషన్లు చేయించుకుని నిర్మాణాలకు జీవీఎంసీ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. యూఎల్‌సీ స్థలం, దాని చుట్టుపక్కల భూముల్లో నిర్మాణాలకు దరఖాస్తు అందినట్టయితే...దానిని కలెక్టర్‌కు పంపి అక్కడ నుంచి నిరభ్యంతర పత్రం వచ్చిన తరువాతే ప్లాన్‌ ఇవ్వాలి. కానీ జీవీఎంసీ ప్లానింగ్‌ విభాగం ముడుపులు తీసుకుని ఎడాపెడా నిర్మాణాలను అనుమతులు ఇచ్చేస్తోంది. యూఎల్‌సీ స్థలాలు కాపాడాల్సిన రెవెన్యూ అఽధికారులు, సిబ్బంది తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. యూఎల్‌సీ విభాగం సిబ్బంది కార్యాలయానికే పరిమితమై సమీక్షలు, సమావేశాలు, కోర్టులకు హాజరుతో కాలక్షేపం చేస్తున్నారు.

యూఎల్‌సీ చట్టం అమలులోకి వచ్చిన తరువాత నగరంలో 186 హెక్టార్ల మిగులు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఆ భూముల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలావరకూ ఆక్రమణకు గురయ్యాయి. కొన్నిచోట్ల నివాసాలు వెలిశాయి. యూఎల్‌సీ స్థలాల క్రమబద్ధీకరణకు ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 186 హెక్టార్లలో 86 హెక్టార్లలో 3,025 కట్టడాలు వున్నట్టు గుర్తించిన అఽధికారులు, మరో 100 హెక్టార్ల లెక్కలు ఇప్పటికీ తేల్చలేదు. ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆయా ప్రాంతాల్లో వున్న రిజిస్ట్రేషన్‌ విలువపై ఒకటిన్నర రెట్లు ఎక్కువ చెల్లించాలని ప్రభుత్వం పేర్కొనడంతో ఆక్రమణదారులెవరూ ముందుకురాలేదు. అయితే నిబంధనల ప్రకారం అసలు స్థలాలు క్రమబద్ధీకరణ చేయకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ నగరంలో అనేకచోట్ల ఆక్రమణదారులు తప్పుడు సర్వే నంబర్లు వేసి జీవీఎంసీ నుంచి ప్లాన్‌లు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులు అందితే జీవీఎంసీ అధికారులు నిర్మాణాలను నిలిపివేయాలని సూచిస్తున్నారు తప్ప...తప్పుడు సర్వే నంబర్‌తో ప్లాన్‌కు దరఖాస్తు చేసినందుకు క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం లేదు.

రెవెన్యూ, జీవీఎంసీ మధ్య కొరవడిన సమన్వయం

యూఎల్‌సీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. కానీ నగరంలో ఏడు తహసీల్దార్ల కార్యాలయాల పరిధిలో గల యూఎల్‌సీ భూముల రక్షణ విషయంలో అధికారులు, సిబ్బంది తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీఆర్వో నుంచి పైవరకూ...అందరికీ ఎక్కడెక్కడా యూఎల్‌సీ భూములు ఉన్నదీ తెలుసు. అయినా వీరిలో ఎక్కువ మంది...ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారని, క్రమబద్ధీకరణ చేయించుకోకుండా నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా యూఎల్‌సీ భూముల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చే విషయంలో రెవెన్యూ, జీవీఎంసీ మధ్య సమన్వయం లేదు. యూఎల్‌సీ భూముల్లో నిర్మా ణాలకు వచ్చే దరఖాస్తును రెవెన్యూకు పంపాలనే ఆలోచన లేకుండా జీవీఎంసీ వ్యవహరిస్తోంది. యూఎల్‌సీ భూముల పర్యవేక్షణ, క్రమబద్ధీకరణ, నిర్మాణాలకు ఎన్‌వోసీ ఇవ్వడానికి కలెక్టరేట్‌లో ఒక విభాగం ఉంది. గతంలో ఆర్డీవో స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేసే యూఎల్‌సీ ఇప్పుడు డీటీ కేడర్‌ అధికారి పర్యవేక్షణలో కొనసాగుతుంది. కలెక్టర్‌, జేసీ సమీక్షలు, కోర్టు కేసులతో ఈ విభాగం కాలక్షేపం చేస్తోంది. గతంలో యూఎల్‌సీ విభాగానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఒక అఽధికారి భారీస్థాయిలో అవినీతికి పాల్పడి నగరంలో అనేక స్థలాలను రెగ్యులర్‌ చేశారు. యూఎల్‌సీ కింగ్‌గా చెప్పుకునే వ్యక్తి ఒకరు ఈ విభాగంలో అనేక రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారనే అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం తప్పుడు సర్వేనంబర్లతో జీవీఎంసీ నుంచి ప్లాన్‌లు తీసుకుంటున్న వ్యక్తులకు యూఎల్‌సీ కింగే ఆద్యుడిగా చెప్పుకుంటారు. ఆయనే దసపల్లా భూములను 22-ఎ నుంచి తప్పించే వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-12-07T00:46:01+05:30 IST