సచివాలయాలతో డమ్మీలుగా మారిపోయాం

ABN , First Publish Date - 2022-11-23T02:22:20+05:30 IST

‘స్థానికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. సచివాలయ వ్యవస్థతో డమ్మీలుగా మారిపోయాం.

సచివాలయాలతో డమ్మీలుగా మారిపోయాం

అధికార పార్టీలో ఉన్నామని అడగలేకున్నాం

సమస్యలపై ముఖ్యమంత్రిని కలుస్తాం

పరిష్కరించకుంటే రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తాం

జనవరిలో ‘చలో ఢిల్లీ’ నిర్వహిస్తాం: వైసీపీ సర్పంచులు

విజయవాడ(ధర్నాచౌక్‌), నవంబరు 22: ‘స్థానికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. సచివాలయ వ్యవస్థతో డమ్మీలుగా మారిపోయాం. అధికార పార్టీలో ఉన్నందుకు ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేక పోతున్నాం. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలుస్తాం. అప్పటికీ పరిష్కరించకపోతే రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తాం’ అని వైసీపీ సర్పంచ్‌లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రస్ధాయి కమిటీని ఏర్పాటు చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విజయవాడలోని గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో వైసీపీ సర్పంచ్‌లు మంగళవారం సమావేశమయ్యారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు అఽధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కడప జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (ఢిల్లీ) జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని, గ్రీన్‌ అంబాసిడర్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, గ్రామ సచివాలయాల కార్యకలాపాలు సర్పంచ్‌ల ఆధీనంలోనే జరగాలని, వలంటీర్లు, సిబ్బంది సర్పంచ్‌ల ఆధీనంలోనే ఉండాలని, 20 లక్షల ప్రమాద భీమా సదుపాయం కల్పించాలని, మైనర్‌ పంచాయతీల కరెంట్‌ బిల్లులు, తాగునీటి సరఫరా, వీధిలైట్ల భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పీయంఎ్‌ఫఎస్‌ లింకేజ్‌ ఉన్న కొత్త బ్యాంకు ఖాతాల్లోనే కేంద్రం నేరుగా జమ చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరిలో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు.

Updated Date - 2022-11-23T02:22:20+05:30 IST

Read more