జలమయం..!

ABN , First Publish Date - 2022-10-07T06:29:45+05:30 IST

అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. కొన్నిచోట్ల విడతలవారీగా పడడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎలమంచిలిలో కుండపోత వానకు ఎటుచూసినా జలమే కనిపించింది.

జలమయం..!
ఎలమంచిలి సీహెచ్‌సీ ఆవరణలో నిలిచిన వర్షం నీరు

 అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు

ఎలమంచిలి పట్టణంలో పరిస్థితి మరీదారుణం

జల దిగ్బంధంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు

శేషుగెడ్డ ఉధృత ప్రవాహనంతో వాహనదారులకు కష్టాలు

ఎలమంచిలి, అక్టోబరు 6: అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. కొన్నిచోట్ల విడతలవారీగా పడడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎలమంచిలిలో కుండపోత వానకు ఎటుచూసినా జలమే కనిపించింది. ప్రభుత్వ ఆస్పత్రి, ఎంపీడీవో కార్యాలయ భవనాలు జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి నీరు ప్రవహించడంతో వాహనచోదకులతో పాటు పాదచారులు సైతం రాకపోకలకు అవస్థలు పడ్డారు. పట్టణంలో కొన్నిచోట్ల డ్రైనేజీలు ఆక్రమణకు గురికావడంతో నీరుపారే మారేమార్గం లేక రోడ్లపైకి చేరింది.  కొక్కిరాపల్లి పీఏసీఎస్‌ రోడ్డు, క్లబ్‌ రోడ్డు జంక్షన్‌, సైతారుపేట రోడ్డు, ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద రోడ్డు, యర్రవరం జంక్షన్‌ రోడ్లలో భారీ నీరు నిలిచిపోయింది. ఓ వైపు ఆక్రమణలు, మరోవైపు కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో భారీ వర్షాల సమయాల్లో ఈ పరిస్థితి తలెత్తుతోందని మునిసిపల్‌ అధికారులు, పాలకుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

పొంగిపొర్లిన శేషుగెడ్డ

ఇదిలావుంటే, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి శేషుగెడ్డ పొంగిపొర్లింది. దీంతో ప్రధాన రోడ్డుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. పట్టణంలోని పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం సమీపంలో ఉన్న  గెడ్డ నీరు భారీగా రోడ్డుపైకి రావడంతో ఎలమంచిలి- అనకాపల్లి రహదారిలో ప్రయాణించే వాహనదారులకు కొంతవరకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలను నెమ్మదిగా నడిపారు. ఈ గెడ్డ ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా ఈ సమస్య ఉన్నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోవడం ఆశ్చర్యకరం. 

తాళ్ళపాలెం జంక్షన్‌ జలమయం

కశింకోట: భారీ వర్షాలకు 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న తాళ్ళపాలెం ప్రధాన కూడలి జలమయమైంది. ఈ కూడలి చెరువును తలపించేలా గురువారం దర్శనమిచ్చింది. నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లికి వెళ్లే వాహనచోదకులు ఈ జంక్షన్‌ను దాటడానికి అవస్థలు పడ్డారు.  వర్షపునీరు పారేందుకు  ఆ చుట్టు ప్రక్కల కాలువలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు చెపుతున్నారు.  ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు. 

ఉధృతంగా సర్పా, వరహా నదుల ప్రవాహం 

కోటవురట్ల: మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని సర్పా, వరహా నదులు ఉధృతంగా ప్రవహించారు.  మంగళవారం నుంచి గురువారం సాయంత్రం వరకు  విడతల వారీగా వర్షం పడిది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. నదుల్లో నీరు చేరడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. అలాగే తాండవ, దుగ్గాడ కాలువల్లోనూ నీరు పుష్కలంగా చేరింది.

చెరువును తలపించిన రహదారులు

పరవాడ: మండలంలో బుధ, గురువారాల్లో భారీ వర్షం కురిసింది. దీంతోలోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైనుంచి నీరు పారింది. ఫార్మాసిటీలోని పలు రహదారులు చెరువును తలపించాయి. వరి పొలాల్లో నీరు సంవృద్ధిగా చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 

చిత్తడిగా మారిన రోడ్లు

రాంబిల్లి: గత రెండు రోజలుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు రహదారులు చిత్తడిగా మారాయి. వెంకటాపురం నుంచి వాడనర్సాపురం వరకు ఉన్న నేవీ రోడ్డు మరీదారుణంగా ఉంది. గోతులమయం కావడంతో ఎక్కడికక్కడ రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. ఆయా గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Read more