వర్షాల పట్ల అప్రమత్తం
ABN , First Publish Date - 2022-10-07T06:06:00+05:30 IST
తీవ్ర వర్షాల నేపథ్యంలో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి గ్రామాల్లో అత్యవసర సేవలు అందించాలని పాడేరు సబ్‌కలెక్టర్ అభిషేక్ ఆదేశించారు.
సచివాలయ సిబ్బందికి సబ్‌కలెక్టర్ ఆదేశం
అనంతగిరి, అక్టోబరు 6: తీవ్ర వర్షాల నేపథ్యంలో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి గ్రామాల్లో అత్యవసర సేవలు అందించాలని పాడేరు సబ్‌కలెక్టర్ అభిషేక్ ఆదేశించారు. ఆయన గురువారం మండలంలోని కోనాపురం, కొండిభ, టోకూరు, అనంతగిరి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాలకు వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. బూత్ లెవల్ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. అనంతరం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లత్సాపాత్రుడు, ఆర్‌ఐ నల్లన్న, కార్యదర్శులు లక్ష్మి, జోగారావు పాల్గొన్నారు.