Visakhaలో నాలుగో సింహానికి కష్టాలు..పైఅధికారుల వేధింపులే కారణమా..అసలు ఏం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2022-05-28T17:23:17+05:30 IST

శాఖ. అలలు ఎగసేపడే సాగర తీరాన కొలవైన అందమైన నగరం. మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా పేరుంది. ఇక జనమైతే ఎంతో సౌమ్యులని ఇక్కడ పనిచేపే

Visakhaలో నాలుగో సింహానికి కష్టాలు..పైఅధికారుల వేధింపులే కారణమా..అసలు ఏం జరుగుతోంది..!?

విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ లో సిబ్బంది డిప్రెషన్‌ కు గురవుతున్నారా? పోలీసాధికారులందరూ సెలవుల్లో వెళ్ళిపోవడానికి కారణమేంటి? అధికారుల ఒత్తిడి తట్టుకోలేకే ఉద్యోగాలు వదలుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఎంత చిన్న తప్పుకైనా వీఆర్‌కు పంపుతుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? డిప్రెషన్‌కు గురయినవారి లిస్ట్‌ ఇవ్వడంటున్న ఉన్నతాధికారులు ఆ లిస్టుతో నాలుక గీసుకుంటారా అని పోలీసు సిబ్బంది అసహనం వ్యక్తం చేయడం వెనుకున్న నిస్సహాయత ఏమిటి? అసలు పోలీసుశాఖలో ఏం జరుగుతోంది? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం...


విశాఖలో డ్యూటీ చేయాలంటే వణుకుతున్న పోలీసులు

విశాఖ. అలలు ఎగసేపడే సాగర తీరాన కొలవైన అందమైన నగరం.  మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా పేరుంది. ఇక జనమైతే ఎంతో సౌమ్యులని ఇక్కడ పనిచేపే ప్రతి పోలీసాధికారి కితాబిస్తుంటారు. మరి అంతటి ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో పోలీసుశాఖ మాత్రం అలజడికి గురవుతోంది. ఒకనాడు విశాఖలో పోస్టింగ్‌ అంటే ఎగిరిగంతేసే పోలీసులు ఇప్పుడు ఇక్కడ పనిచేయాలంటేనే వణికిపోతున్నారు. ఉద్యోగానికి వచ్చి బదిలీ అయ్యేలోపు ఏ ఛార్జ్‌ మెమో లేకుండా ఉంటే చాలనుకుంటున్నారు. విశాఖ కమిషనరేట్‌లో పనిచేయలేంటూ చాలామంది అధికారులు ఏకంగా దీర్ఘకాల సెలవులపై వెళ్ళిపోతున్నారు.  పోలీసుశాఖలో ఎవరైనా ఒత్తడికి గురైనా, పై అధికారుల వేధింపులు ఉన్నా తమకు నేరుగా తెలియజేయమనే డైరక్టర్‌ జనరల్ ఆఫ్‌ పోలీసు ఉత్తర్వులు ఉత్తమాటేనని, అసలు సంగతి వారికి తెలుసని పోలీసులంటున్నారు. 


ఈస్ట్ ఏసీపీ హర్షితకు డీసీపీ మధ్య ఓ కేసు విషయంలో వార్‌ 

విశాఖ కమిషనరేట్ పరిధిలో 23 పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి.  11 మంది ఏసీపీలు ఉన్నారు. ఇందులో వెస్ట్ , ఈస్ట్  , హార్బర్ , దిశా  , ఎస్సీఎస్టీ సెల్  ఎసీపీలు సెలవులో ఉన్నారు. ఇక  సౌత్ ఏసీపీ పోస్టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. ఒకేసారి ఐదుగురు ఏసీపీలు మూకుమ్మడి సెలవుల్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది.  ఈస్ట్ ఏసీపీ హర్షితకు  డిసీపీ  మధ్య  ఓ కేసు విషయంలో వార్‌ నడిచిందని,  ఈ విషయం  తాను సీఎంతోనే తేల్చుకుంటానని చెప్పిన ఆమె  మరుసటి రోజే సెలవుపై వెళ్ళిపోయారు. మరో మహిళ ఏసీపీ పరిస్థితి మరింత దారుణం. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉన్నారు.


  అయినా డ్యూటీ చేస్తున్నారు. ఇటీవల ఈమె పనిచేస్తున్న స్టేషన్‌కు  పోలీస్ బాస్ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. దీంతో ఆయన స్టేషన వీడి వెళ్ళే వరకూ దాదాపు గంటసేపు ఆమె నిలుచునే ఉండాల్సి వచ్చింది. దీంతో ఈమె కూడా మరుసటి రోజు సిక్ లీవ్ పై  వెళ్లిపోయారట. మరోపక్క  వెస్ట్ ఏసీపీ కూడా అధికారుల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లారని, అయినా ఉద్యోగంలో తక్షణమే చేరాలని అధికారులు ఆదేశించారని, ఒకవేళ చేరకపోతే తగిన చర్యలు తీసుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. 


విజయనగరం ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌  ఆత్మహత్య

ఇక కిందిస్థాయి సిబ్బందిది మరో గాథ. ఇటీవల కమిషనర్‌ కమిషనర్ శ్రీకాంత్  తనిఖీలకు వచ్చారు. ఆ సమయంలో  నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ క్యాప్ పెట్టలేదని, మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్  సిబ్బంది సివిల్ డ్రెస్ లో ఉన్నారంటూ ఇద్దరని వీఆర్ కు పంపారు. ఇదిలా ఉంటే... మీ స్టేషన్ పరిధిలో ఎంత మంది డిప్రెషన్ లో ఉన్నారు? పేరు, ఫోన్ నెంబర్ డిజీ కార్యాలయానికి మెయిల్ చేస్తే  వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామంటూ  ఏపీలో అన్ని పోలీస్ స్టేషన్ లకు సందేశాలు అందాయి. ఇటీవల విజయనగరం ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌  ఆత్మహత్య,  కాకినాడ ఎస్ ఐ తుపాకీతో కాల్చుకోవడం, ఎచ్చర్లలో  కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడాన్ని  డిజీ కార్యాలయం సీరియస్ గా తీసుకుంది.  కానీ ఈ విషయంలో  పోలీసులకు మరో అనుమానం తొలిచేస్తోంది. తమ పరిధిలో అధికారుల నుంచి ఒత్తిడి ఉందని  చెపితే  సమస్య పరిష్కారం కాకపోగా.మరింత ముదిరే ప్రమాదముందనుకుంటున్నారుట.


నాలుగో సింహం నవ్వేదెప్పుడు? వారి కష్టాలు తీరేదెప్పుడు? 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోలీసుల వీక్లి హాఫ్ లు సక్రమంగా అమలు చేస్తే.. సగం సమస్య తీరేనట్టనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.  విశాఖలో సెలవులపై వెళ్ళిన ఏసీపీలు వచ్చేవరకూ  సీఐ, ఎస్‌ఐలకు వీక్లీ హాఫ్‌లు లేవని చెప్పేశారు. మరోపక్క గతంలో నైట్‌ రౌండ్స్‌లో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ళు  ఉండేవారు. ఇప్పుడీ డ్యూటీ కేవలం ఎస్‌ఐలకే పరిమితం చేయడంతో వారు అల్లాడిపోతున్నారు. వారంలో నాలుగురోజులు కచ్చితంగా నైట్‌ రౌండ్స్‌ ఉంటుండంటతో డ్యూటీలు కష్టంగా ఉంటున్నాయని ఉన్నతాధికారులకు చెప్పుకున్నా ఫలితం ఉండటంలేదు.   విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏసీపీల అర్థాంతర మూకుమ్మడి సెలవులు, సిబ్బంది కష్టాల వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకుంటే సరిపోతుందని,  అంతేకానీ ఎవరు డిప్రెషన్‌కు గురవుతున్నారో మెయిల్‌ చేయండని చెప్పడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని పోలీసుసిబ్బందే అంటున్నారు. జనం ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు నిస్సహాయంగా బలవన్మారణాలకు పాల్పడటం ఆ శాఖ దుస్థితిని సూచిస్తోంది. మరి ఈ నాలుగో సింహం నవ్వేదెప్పుడు? వారి కష్టాలు తీరేదెప్పుడు? 

Updated Date - 2022-05-28T17:23:17+05:30 IST