గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-05-25T05:56:37+05:30 IST

ప్రతీఒక్కరూ గ్రామాలను పరిశుభ్రంగా వుంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సూచించారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి
డస్ట్‌బిన్‌లను పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, తదితరులు

కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున 

ఆనందపురం, మే 24: ప్రతీఒక్కరూ గ్రామాలను పరిశుభ్రంగా వుంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సూచించారు. మంగళవారం ఆనందపురంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెత్తను వేరు చేసి ఏ విదంగా ఆదాయం సమకూర్చుకోవచ్చో ప్రజలకు వివరించారు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఆకుపచ్చ డబ్బా తడిచెత్తకు, నీలం డబ్బాను పొడిచెత్తకు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగ కేంద్రాలకు తరలించి ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. తడిచెత్తతో ఆరోగ్యకరమైన సేంద్రియ ఎరువులను తయారుచేయాలన్నారు. వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయని, దీనిపై విద్యార్థులు, మహిళలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వలంటీర్లు ఎప్పటికప్పుడు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీపీవో కృష్ణకుమారి, ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక, జడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, సర్పంచ్‌ చందక లక్ష్మి, ఎంపీడీవో లవరాజు, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:56:37+05:30 IST