వసంతబాల పాఠశాలను ప్రభుత్వమే నడపాలి
ABN , First Publish Date - 2022-07-06T05:49:11+05:30 IST
నగరంలోని గురుద్వారా దరి టీపీటీ కాలనీలో గల వసంత బాల విద్యోదయ ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించాలని విద్యార్థి సంఘం నాయకుడు సమయం హేమంత్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడులు డిమాండ్ చేశారు

విద్యార్థి సంఘాల డిమాండ్
సీతమ్మధార, జూలై 5: నగరంలోని గురుద్వారా దరి టీపీటీ కాలనీలో గల వసంత బాల విద్యోదయ ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించాలని విద్యార్థి సంఘం నాయకుడు సమయం హేమంత్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడులు డిమాండ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో మంగళవారం పాఠశాల తరగతి గదులు మూసి ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ పాఠశాలను 1975లో ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ ప్రస్తుతం వీఎంఆర్డీఏ ఇచ్చిన స్థలంలో గతంలో నడిపేవారన్నారు. అందులో ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి, టీచర్లు, విద్యార్థులు లేరు అన్న సాకుతో ప్రైవేట్ పాఠశాలగా మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలకు కరస్పాండెంట్ సురేష్ అధిక ఫీజులతో పాఠశాల ప్రారంభిచబోతున్న నేపఽథ్యంలో అడ్డుకొని నిరసన వ్యక్తంచేసినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలగా కొనసాగించే వరకు కలెక్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థులతో నిరసన తెలుపుతామన్నారు. అనంతరం విద్యార్థులతో కలసి వెళ్లి కలెక్టరేట్ వద్ద నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యూఎస్ఎన్ రాజు, వి.కృష్ణారావు, కె.కుమారి, ఆదిలక్ష్మి, పి.లక్ష్మి, సనపల తిరుపతిరావు, దుర్గారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.