వాడీవేడిగా మునిసిపల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-08-31T06:36:33+05:30 IST

నర్సీపట్నం మునిపాలిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. మంగళవారం జరిగిన సమావేశంలో అజెండాపై వైసీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ప్రశ్నలు సందించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

వాడీవేడిగా మునిసిపల్‌ సమావేశం
మున్సిపల్‌ సమావేశంలో పోడియం వద్ద బైఠాయించిన 1వ వార్డు కౌన్సిలర్‌ లాలం వరహాలమ్మ


 జెండా వందనం రోజు జరిగిన అవమానాన్ని సభ దృష్టికి తెచ్చిన ఒకటో వార్డు కౌన్సిలర్‌

అడ్మిన్‌పై ఆర్డీవోకి నివేదిక ఇచ్చామన్న కమిషనర్‌

ఎక్స్‌కవేటర్లకు డీజిల్‌ కొరత,వీధి లైట్ల ఏర్పాట్లుపై వాదోపవాదాలు

నర్సీపట్నం అర్బన్‌, ఆగస్ట్టు 30: నర్సీపట్నం మునిపాలిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. మంగళవారం జరిగిన సమావేశంలో అజెండాపై వైసీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ప్రశ్నలు సందించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లి దొర మాట్లాడుతూ సమస్యలపై సమగ్రమైన చర్చ జరగాలని, తమ వార్డులో ఆక్రమణల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆగస్టు 15వ తేదీన జరిగిన జెండా వందనంలో తనకు జరిగిన అవమానాన్ని ఒకటవ వార్డు కౌన్సిలర్‌ లాలం వరహాలమ్మ పోడియం వద్ద బైఠాయించారు.  ఆమెకు 26వ వార్డు కౌన్సిలర్‌ పద్మావతి మద్దతు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన జెండా ఆవిష్కరణకు పిలిచి అవమానపర్చిన వార్డు అడ్మిన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఆర్డీవోకు నివేదిక అందించామని కమిషనర్‌ కనకారావు తెలియజేయడంతో కౌన్సిలర్‌ శాంతించారు. అనంతరం 26వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి, 25వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌ మాట్లాడుతూ.. మునిసిపాలిటీలో కొవిడ్‌ సమయంలో పనిచేసిన పారిశుధ్య కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. 60 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. జూలైౖ 26వ తేదీన అనకాపల్లి ఎంపీ సత్యవతి ల్యాండ్స్‌ రూ.70.88లక్షలతో 17 పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేశారని,  వాటిపై కౌన్సిల్‌లో ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. ఈ నిధులపై సమావేశంలో చర్చించాల్సిన అవరం లేదని చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి సమాధానమిచ్చారు. 24వ వార్డు కౌన్సిలర్‌ ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ.. కాలువల్లో పూడిక తీయడానిక ఎక్స్‌కవేటర్లు అడిగితే  డీజిల్‌ కొరత ఉందని చెబుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. డీజిల్‌ లేకపోతే కౌన్సిలర్లు, చైర్మన్ల కార్లు ఎలా తిరుగుతున్నాయన్నారు. అక్రమ కట్టడాలపై కమిటీ వేయాలని కోరారు. మరో కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ.. వీధిలైట్లు ఏర్పాటులో లక్షలాది రూపాయలు స్వాహా అయ్యాయని ఆరోపించారు. దీనిపై కమిషనర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లపై వివక్ష చూపడం తగదన్నారు. దీనిపై అధికార పార్టీ కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ సిరసపల్లి నాని మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో అమలు చేసిన సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నామన్నారు. ఈ సమయంలో కౌన్సిల్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకేసారి మాట్లాడడంతో గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశంలో చర్చించిన అంశాలన్నీ పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్‌పర్సన్‌ గుదిబండ ఆదిలక్ష్మి, కమిషనర్‌ కనకారావు తెలిపారు.  

Updated Date - 2022-08-31T06:36:33+05:30 IST