పారదర్శకంగా ఓటరు జాబితా నవీకరణ

ABN , First Publish Date - 2022-12-13T00:08:06+05:30 IST

జిల్లాలో ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

పారదర్శకంగా ఓటరు జాబితా నవీకరణ
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలోని ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టరేట్‌ నుంచి సోమవారం సాయంత్రం జిల్లాలోని సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం పౌరుల నుంచి స్వీకరించిన ఫారం- 6, ఫారం- 7లను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. అలాగే జూలై నెల నుంచి నవంబరు వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలన్నారు. అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలని, సరైన కారణం లేకుండా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించరాదని ఆయన సూచించారు. జిల్లాలో మార్పులు, చేర్పుల కోసం 2,771 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇంకా 1,950 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పది రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక్కో మండలం పరిధిలో 500 దరఖాస్తులుంటాయని, ప్రతి మండలంలో కనీసం 40 నుంచి 50 మంది బూత్‌ స్థాయి అధికారులున్నారని, ఈ లెక్కన ఒక్కో బీఎల్‌వో 10 దరఖాస్తులు చొప్పున క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ఈ నెల 22వ తేదీ నాటికి పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ నేతలతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ అశుతోశ్‌ శ్రీవాత్సవ, ఎన్నికల పర్యవేక్షకులు నాగజ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:08:06+05:30 IST

Read more