ఒంటరితనాన్ని భరించలేక.... వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-12-15T03:09:22+05:30 IST

పిల్లలు దూరంగా విదేశాలలో ఉండడంతో ఒంటరితనంతోపాటు మానసిక ఒత్తిడికి గురై వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు..

ఒంటరితనాన్ని భరించలేక.... వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

మహారాణిపేట (విశాఖపట్నం), డిసెంబరు 14: పిల్లలు దూరంగా విదేశాలలో ఉండడంతో ఒంటరితనంతోపాటు మానసిక ఒత్తిడికి గురై వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక సున్నపువీధిలో సత్యనారాయణ గుప్తా (65), రమణకుమారి (62) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు అమెరికాలో, మరో కుమారుడు హైదరాబాద్‌లో, కుమార్తె కువైత్‌లో ఉంటున్నారు. పిల్లలు ముగ్గురూ దూరంగా ఉండడంతో వృద్ధ దంపతులు ఒంటరితనంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో దంపతులు ఇద్దరూ నిద్రమాత్రలను ఎక్కువ మోతాదులో వేసుకొని అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ విషయం కువైత్‌లో ఉన్న కుమార్తెకు తెలిసి, వెంటనే తనకు పరిచయం ఉన్న నగరంలోని స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సుభానీకి ఫోన్‌ ద్వారా తెలిపి వెంటనే కాపాడాలని కోరింది. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులతో కలసి వృద్ధులు ఉంటున్న ఇంటికి వెళ్లి, అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆయన కేజీహెచ్‌కు తరలించారు. రమణకుమారి పరిస్థితి మెరుగుపడినప్పటికీ, సత్యనారాయణ పూర్తిగా తేరుకోలేదు.

Updated Date - 2022-12-15T03:09:23+05:30 IST