యూఎల్‌సీయే కీలకం

ABN , First Publish Date - 2022-10-07T06:15:12+05:30 IST

దసపల్లా భూముల వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి.

యూఎల్‌సీయే కీలకం

దసపల్లా భూముల వివరాలు

సమర్పించాల్సిందిగా ఆ విభాగం సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశం

1976లో చట్టం అమలులోకి వచ్చినప్పుడు రాణి కమలాదేవి నుంచి భూములు స్వాధీనం

ఆ సమయంలో యజమానిగా 6 (1) డిక్లరేషన్‌

ఇప్పుడు ఆ పత్రం కోసం అన్వేషణ

వివాదం చెలరేగడంతో రెవెన్యూలో ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దసపల్లా భూముల వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. చివరకు వైసీపీ నేతలు కూడా ఈ భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడేందుకు ఇప్పటివరకూ సాహసించలేదు. ఇదిలావుండగా ఈ భూ వివాదానికి సంబంధించి అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) విభాగం ఇచ్చే నివేదిక ఇప్పుడు కీలకంగా మారిందని చెబుతున్నారు. ఈ విభాగం ప్రత్యేకాధికారి పోస్టును గత ప్రభుత్వ హయాంలో రద్దు చేయడంతో జాయింట్‌ కలెక్టర్‌ పరిధిలో పనిచేస్తోంది. యూఎల్‌సీ సెక్షన్‌లో డిప్యూటీ తహసీల్దార్‌, మరికొందరు సిబ్బంది ఉన్నారు. 

దసపల్లా భూములను అప్పట్లో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌  (యూఎల్‌సీ) చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1976లో చట్టం అమలులోకి వచ్చినప్పుడు సర్వే నంబరు 1027, 1028, 1196, 1197లో వున్న భూములకు యజమాని రాణి కమలాదేవి 6 (1) డిక్లరేషన్‌ ఇచ్చారు. యూఎల్‌సీ చట్టం మేరకు నగరంలో ఒక వ్యక్తికి 1500 చదరపు గజాల స్థలం మాత్రమే ఉండాలి. దీనిప్రకారం తనతోపాటు ముగ్గురు పిల్లలకు 1500 గజాలు ఇవ్వాలని డిక్లరేషన్‌లో ఆమె కోరినట్టు చెబుతున్నారు. దీనికి అప్పటి అధికారులు అంగీకరించకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్లగా...ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉందంటున్నారు. చివరకు యూఎల్‌సీ విషయాన్ని అధికారులు వదిలేసి, గ్రౌండ్‌ రెంట్‌ పట్టా చుట్టూ తిరుగుతూ కోర్టులో సకాలంలో కౌంటర్‌ వేయలేక ఓడిపోయారు. తాజాగా సీసీఎల్‌ఏ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ మేరకు ఈ భూములపై కలెక్టర్‌ మల్లికార్జున నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు కలెక్టరేట్‌లోని యూఎల్‌సీ విభాగంపైనే ఉంది. దసపల్లా భూములపై అవసరమైన సమాచారం సిద్ధం చేయాలని ఈ విభాగాన్ని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిసింది. దీంతో ఫైళ్లు బయటకు తీసి మొత్తం వివరాలు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ వివాదానికి కీలకంగా పేర్కొంటున్న రాణి కమలాదేవి 6 (1) డిక్లరేషన్‌ కాపీ కూడా బయటకు తీసే పనిలో వున్నట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారం గురించి  విభాగం సిబ్బంది నోరు మెదపడం లేదు. ఇదిలావుండగా సీసీఎల్‌ఏ గత నెల 29న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ మేరకు భూములపై ఫైలును సర్క్యులేషన్‌లో పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం సాగుతుంది. భూములపై సాధ్యాసాధ్యాలు, కోర్టు తీర్పులు, యూఎల్‌సీ వివాదం వంటి అంశాలపై ఒక నోట్‌ సిద్ధం చేసే పనిలో వున్నారని తెలిసింది. సెలవులో వున్న కలెక్టర్‌ మల్లికార్జున  ఈ నెల తొమ్మిదో తేదీన తిరిగి రానున్నారు. ఆ తరువాతే అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం వుందని అంటున్నారు. దసపల్లా భూములను 22--ఎ నుంచి తొలగించాలని సీసీఎల్‌ఎ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన వెంటనే నగరంలో అలజడి మొదలైంది. విపక్షాలు ఆందోళన చేయడంతోపాటు అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులకు చెందిన ఖాతాల నుంచి దసపల్లా భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు రూ.ఐదు కోట్లు బదలాయించినట్టు ఆరోపిస్తుండడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ముందుకువెళితే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. గతంలో పలువురు ఉన్నతాధికారులు ఈ భూములు జోలికి వెళ్లడానికి సాహసించలేదు. ఇప్పుడు తొందరపడితే అపకీర్తి మూటగట్టుకోవడంతోపాటు భవిష్యత్తులో బోను ఎక్కాల్సి వస్తుందేమోనని రెవెన్యూ యంత్రాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read more