ఉక్రెయిన్‌ నుంచి 42 మంది రాక

ABN , First Publish Date - 2022-03-05T06:14:55+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పలువురు విద్యార్థులు శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి 42 మంది రాక

గోపాలపట్నం, మార్చి 4: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పలువురు విద్యార్థులు శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు.  ఢిల్లీ నుంచి వచ్చిన పలు విమానాల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 42 మంది విద్యార్థులు  ఇక్కడకు వచ్చారు. విద్యార్థులకు తల్లిదండ్రులు, నేతలు, అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. 


బంకర్లలోనే తలదాచుకున్నాం

- ఎం.సమీర్‌, డాబాగార్డెన్స్‌

రెండు రోజుల పాటు బంకర్లలోనే తలదాచుకున్నాం. అక్కడ అధికారులు ఇచ్చిన సూచన మేరకు జాగ్రత్తలు పాటించేవాళ్లం. సరిహద్దులు దాటడం మాత్రం ఎంతో కష్టమైంది. చాలామంది ఇంకా సరిహద్దు దగ్గరకు చేరనే లేదు. అక్కడ పరిస్థితి భయానకంగానే ఉంది. ఎంతో ఇబ్బంది పడినా ప్రభుత్వ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకోగలిగాం.


ఇది మాకు పునర్జన్మ

- రెడ్డి నోముల సత్య శ్రీజ, పెందుర్తి రాంపురం

నిజంగా ఇది మాకు పునర్జన్మ. మేం ఉక్రెయిన్‌ ఖార్కివ్‌ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కిన వెంటనే సమీపంలో బాంబు దాడులు జరిగాయి. మేం తీవ్ర భయాందోళనకు గురయ్యాం. ఉక్రెయిన్‌ నుంచి రైల్లో 17 గంటలు ప్రయాణం చేసి పశ్చిమ భాగాన గల లివి రాష్ట్రం చేరుకున్నాం. అక్కడ నుంచి పోలాండ్‌ వెళ్లాం. ఆ తరువాత ఇండియాకు చేరుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.


Read more