సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ABN , First Publish Date - 2022-11-19T02:57:51+05:30 IST

విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా.. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.భీమిలి సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం..

సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

బయటపడిన మరో విద్యార్థి

భీమునిపట్నం, నవంబరు 18: విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా.. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.భీమిలి సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం.. తగరపువలస అనిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుడితి సాయి (20), వేమల సూర్యవంశీ (19), మహాపాత్రో మణికంఠ (19) ఉదయం 11.30 గంటల సమయంలో భీమిలి బీచ్‌కు వెళ్లారు. తొలుత జీవీఎంసీ జోనల్‌ కార్యాలయానికి సమీపంలో సముద్రంలో ఈతకు దిగడానికి యత్నించారు. మెరైన్‌ పోలీసు కానిస్టేబుళ్లు గమనించి.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని వారించి వెనక్కి పంపించేశారు. అక్కడి నుంచి బీచ్‌ రోడ్డులో ఉన్న సాగరకన్య విగ్రహం వద్దకు చేరుకున్న విద్యార్థులు తీరంలో బ్యాగ్‌లు పెట్టి సముద్రంలో ఈతకు దిగారు. దిగిన కొద్ది నిమిషాలకే సూర్యవంశీ కెరటాల్లో కొట్టుకుపోతుండగా సాయి రక్షించడానికి యత్నించాడు. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండడంతో అతను కూడా కొట్టుకుపోయాడు. అది చూసి మణికంఠ వెనుతిరిగి వచ్చేశాడు. భీమిలి ఎస్‌ఐలు జి.హరీష్‌, డి.తాతారావు, రుషికొండ మెరైన్‌ సీఐ మురళీకృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకార యువకులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌ సిలిండర్లతో ఐఎన్‌ఎస్‌ కళింగ్‌ కర్ణ విభాగం నేవల్‌ కమాండోస్‌ ఏడుగురు సముద్రంలోకి వెళ్లి గాలించినా ఫలితం లేకపోయింది. నేవల్‌ హెలికాప్టర్‌తో గాలించినా ఆచూకీ దొరకలేదు.

Updated Date - 2022-11-19T02:57:51+05:30 IST

Read more