బదిలీలలు!
ABN , First Publish Date - 2022-07-03T06:36:02+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రహసనంలా సాగింది.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
ఏజెన్సీ ఉద్యోగుల వినతిని పట్టించుకోని యంత్రాంగం
ఏడెనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా మైదాన ప్రాంతానికి పంపని వైనం
డీఆర్డీఏలో మరో విచిత్రం
వెలుగు సిబ్బందికే స్థానచలనం
ఒక్క ఉద్యోగిని కదలించలేదు
జడ్పీలో సంఘ నేతకు మినహాయింపు
ప్రహసనంగా మారిన ప్రక్రియ
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రహసనంలా సాగింది. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిన అధికారులు అయిన వారిని మంచి స్థానాల్లో కూర్చోబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏజెన్సీలో ఏళ్లుగా పనిచేస్తూ 60 ఏళ్ల వయసున్న అధికారులు, ఉద్యోగులను మైదాన ప్రాంతం లేదా నగరానికి బదిలీ చేయకపోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులు గత నెలలో ప్రధాన భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ను కలిశారు. తమ సమస్యలు వివరించి, బదిలీల్లో న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో తమకు మైదాన ప్రాంతం, నగరంలోకి బదిలీలు వుంటాయని ఆశించారు. అక్కడ తహసీల్దార్లుగా వేణుగోపాల్, ఎంవీఎస్ ప్రసాద్ పదేళ్లుగా, శ్యాంప్రసాద్ తొమ్మిదేళ్లు, బి.నాగరాజు ఏడేళ్లు, వి.ప్రకాశరావు ఎనిమిదేళ్లు, డీటీలు సింహాచలం 12.5 సంవత్సరాలు, కె.చంద్రశేఖర్ పదేళ్లు, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ 13 సంవత్సరాలుగా ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం 29 మంది ఉద్యోగుల జాబితాతో వినతిపత్రాన్ని అందజేశారు. అదే సమయంలో నగరం, మైదానంలో పనిచేసి ఏజెన్సీలో పనిచేయని 60 మంది తహసీల్దార్లు/డీటీలు/ఇతర ఉద్యోగుల వివరాలను అందులో పొందుపరిచారు. వీరిలో పాడేరు, అనంతగిరి తహసీల్దార్లు వి.ప్రకాశరావు, ఎంవీవీ ప్రసాద్, పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఏవో శ్యామ్‌ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ తదితరులను మాత్రమే అనకాపల్లి, విశాఖ జిల్లాకు మార్చారు. మరికొందరు సీనియర్లను ఏజెన్సీలోనే కొనసాగించారు. అల్లూరి జిల్లాలో పనిచేసే ఉద్యోగులను బదిలీపై పంపడానికి తమకు అభ్యంతరం లేదని, అందుకు ప్రత్యామ్నాయం చూపించాలని అక్కడి కలెక్టర్ కోరారు. అయితే నగరంలో ఏళ్ల తరబడి పనిచేసే వారిని అక్కడికి పంపాల్సి ఉన్నప్పటికీ, యంత్రాంగం ఎందుకు స్పందించ లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే దశలో నాతవరం నుంచి పాడేరుకు బదిలీ అయిన తహసీల్దార్ కె.జానకమ్మ శనివారం అనకాపల్లి కలెక్టర్‌ను కలిసి బదిలీ రద్దు చేయాలని కోరారు.
డీఆర్డీఏలో మరో కథ
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఎ) ఉద్యోగుల బదిలీల్లో మరో కథ వెలుగుచూసింది. ఇక్కడ పనిచేస్తున్న వెలుగు సిబ్బందిని మాత్రమే బదిలీ చేసిన అధికారులు, డీఆర్డీఏ ఉద్యోగులను ఎందుకు మినహాయించారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అల్లూరి జిల్లాకు ఇద్దరు డ్వాక్రా ఈవోలను పంపాల్సి ఉన్నప్పటికీ నగరం నుంచి ఎవరినీ కదిలించలేదు. వెలుగు సిబ్బందిలో ఇద్దరు డీపీఎంలు, ఒక ఏపీఎంను బదిలీ చేశారు. కాగా డీఆర్డీఏ పరిధిలో కొందరు రెండు నుంచి రెండున్నర దశాబ్దాలుగా నగరంలోనే తిష్ఠ వేసి ఉంటున్నా, వారిని బదిలీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలుగు సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులు కాదు. వారికి వేతన సవరణలు ఉండవు. అయినా వారిని బదిలీ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇక జిల్లా పరిషత్‌లో 333 మందికి శనివారం బదిలీ ఉత్తర్వులు ఉద్యోగుల వ్యక్తిగత మెయిల్స్‌కు పంపామని సీఈవో విజయకుమార్ తెలిపారు. ఇప్పటివరకు జడ్పీలో చక్రం తిప్పి బదిలీల్లో వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘ నేత ఒకరిపై బదిలీ వేటు పడింది. మరో సంఘ నేతను కూడా బదిలీ చేశారు. అయితే ఒక సంఘానికి ఎన్నికలు జరగకపోయినా అధ్యక్షుడిగా చెప్పుకుంటూ విధులకు నిత్యం డుమ్మా కొడుతున్న ఉద్యోగిని బదిలీ నుంచి మినహాయించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా కార్యవర్గం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.
డీపీవో కృష్ణకుమారి కోనసీమ బదిలీ
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా పంచాయతీ అధికారి వి.కృష్ణకుమారికి కోనసీమ బదిలీ అయ్యింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. విశాఖలో వున్న డీపీవో పోస్టును కోనసీమకు బదిలీ చేసి...అక్కడ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి పోస్టు ఏర్పాటు చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా విశాఖ జిల్లాలో నాలుగు మండలాలే వున్నందున డివిజినల్ పంచాయతీ అధికారితో పాలన సాగించే అవకాశం ఉంది.