రైళ్లకు దసరా రద్దీ

ABN , First Publish Date - 2022-10-02T06:34:36+05:30 IST

దసరా ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

రైళ్లకు దసరా రద్దీ
శనివారం కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్‌

అన్నింటిలోనూ బెర్తులు ఫుల్‌

చాంతాడులా పెరిగిన నిరీక్షణ జాబితా

ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్‌ 


విశాఖపట్నం, అక్టోబరు 1:


దసరా ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పండగకు సొంత ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్‌లో శనివారం పండుగ వాతావరణ కనిపించింది. ఉదయం 6.20 గంటలకు బయలుదేరిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ నుంచి రాత్రి 11.20 గంటలకు బయలుదేరే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ వరకు తాకిడి కొనసాగింది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే రైళ్లతోపాటు కోల్‌కతా, భువనేశ్వర్‌, కటక్‌ తదితర పాంతాలకు వెళ్లే రైళ్లలో బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా పెరిగిపోతోంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లకూ తీవ్ర డిమాండ్‌ నెలకొంది. 


హౌరా రైళ్లకు తీవ్ర రద్దీ

హౌరా వెళ్లే రైళ్లకు మరింత రద్దీ ఏర్పడింది. గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (12509), ఈస్ట్‌కోస్ట్‌ (18046),  యశ్వంత్‌పూర్‌-హౌరా (12864), హౌరా-మెయిల్‌ (12840),  కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12842), ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12704), వాస్కోడిగమ-హౌరా (18048),  వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (15905) రద్దీగా నడిచాయి. జనరల్‌ కోచ్‌లలో కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. 


సికింద్రాబాద్‌ రైళ్లదీ అదే పరిస్థితి 

రాజమండ్రి, విజయవాడ, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ప్రయాణికుల తాకిడి కనిపించింది. ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), మధ్యాహ్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లకు (12717) తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది బందోబస్తు నిర్వహించి క్యూ పద్ధతిలో ప్రయాణికులు కోచ్‌ల్లోకి ఎక్కేలా చర్యలు చేపట్టినా సీటు కోసం కొందరు చేసిన ప్రయత్నాలతో తోపులాట జరిగింది. 

ఇక తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17488) శనివారం మరింత రద్దీగా మారింది. బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులతోపాటు రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేవారితో జనరల్‌ కోచ్‌లు కిక్కిరిశాయి. గోదావరి (12727), విశాఖ (17015), రాయగడ-గుంటూరు (17244), విశాఖ-మచిలీపట్నం (17220), విశాఖ-నాందేడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (20811), భువనేశ్వర్‌-తిరుపతి (22879) రైళ్లకూ రద్దీ కొనసాగింది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత బయలుదేరే గరీబ్‌రథ్‌ (12739), ఫలక్‌నూమా (12703),  కోణార్క్‌ (11020),  ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20805),  విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519)లకు ముందుగానే బెర్తులు నిండిపోయాయి.

Read more