నేడే కరకచెట్టు పోలమాంబ తొలేళ్ల ఉత్సవం
ABN , First Publish Date - 2022-04-11T06:16:59+05:30 IST
భక్తుల ఇలవేల్పు కరకచెట్టు పోలమాంబ జాతరకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
రేపు ప్రధాన పండుగ
సర్వం సిద్ధం చేసిన అధికారులు
పెదవాల్తేరు, ఏప్రిల్ 10: భక్తుల ఇలవేల్పు కరకచెట్టు పోలమాంబ జాతరకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం ప్రధాన పండుగ నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల తల్లులను రూ.500 క్యూ లైన్ ద్వారా ఉచితంగా పంపించనున్నారు. అంతేకాకుండా క్యూలోని చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు
కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర సోమ, మంగళవారాల్లో జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో శేఖర్‌బాబుతో పాటు డీసీపీ అమిత్‌గార్గ్, ఏసీపీ హర్షిత చంద్ర, ట్రాఫిక్ ఏసీపీ కుమార్‌స్వామి, సీఐ కోరాడ రామరావు, ఎస్‌ఐలు ధర్మేంద్ర, రాము, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే అవగాహన కల్పించే బ్యానర్ల ప్రదర్శన, మైకుల ద్వారా హెచ్చరికలు, తదితర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అనంతరం వారు ఉచిత దర్శనం, రూ.50, రూ.100, రూ.500, వీఐపీ దర్శన క్యూ లైన్లను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులంతా తమ వాహనాలను ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి దారిలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. సోమవారం తొలేళ్లు, మంగ ళవారం ప్రధాన పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. పోలీసులతో పాటు పలు దేవస్థానాలకు చెందిన 50 మంది సిబ్బంది విధుల్లో వుంటారని, 240 మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలందిస్తారన్నారు.
