పిడుగుపాటుతో గిరిజనుడు మృతి
ABN , First Publish Date - 2022-08-04T06:54:01+05:30 IST
ఏజెన్సీలో పిడుగుల వర్షానికి ఓ గిరిజనుడుతోపాటు పదుల సంఖ్యలో మూగజీవాలు బలయ్యాయి.
54 మూగజీవాలు సైతం బలి
- పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ జమదంగిలో ఘటన
పాడేరు/పెదబయలు, ఆగస్టు 3: ఏజెన్సీలో పిడుగుల వర్షానికి ఓ గిరిజనుడుతోపాటు పదుల సంఖ్యలో మూగజీవాలు బలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పెదబయలు మండలం మారుమూల ఇంజెరి పంచాయతీ జమదంగి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన సమాచారం ప్రకారం... జమదంగిలో పలువురు గిరిజనులకు పశువులు వున్నాయి. వీటిని రోజుకొకరు చొప్పున మేత కోసం అడవుల్లోకి తోలుకెళుతుంటారు. మంగళవారం వంతాల సన్నిబాబు(40) పశువులు, మేకలను సమీపంలోని అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. సన్నిబాబు, పశువులున్న ప్రాంతంలో పిడుగు పడడంతో ఆయనతో పాటు 40 పశువులు, 14 మేకలు అక్కడిక్కడే మృతి చెందాయి. చీకటిపడినప్పటికీ పశువులను మేపేందుకు వెళ్లిన సన్నిబాబు తిరిగి రాకపోవడంతో గ్రామస్థులు అటవీ ప్రాంతానికి వెళ్లి గాలించగా సన్నిబాబుతోపాటు పశువులు, మేకలు విగతజీవులుగా పడివున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.