హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2022-12-16T00:58:02+05:30 IST
ఇక్కడి కొత్తపాలెం శివారులో ఈ నెల తొమ్మిదిన అనుమనాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసులో ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గోపాలపట్నం, డిసెంబరు 15: ఇక్కడి కొత్తపాలెం శివారులో ఈ నెల తొమ్మిదిన అనుమనాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసులో ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల తొమ్మిదిన కొత్తపాలెం గ్రామ శివారులో మూడుగుళ్లు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల మధ్య తుప్పల్లో ఓ వ్యక్తి మృతదేహం వున్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా మృతిగా చెందినట్టు కేసు నమోదు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తను చూసి మృతుడి కుమారుడు కర్రి నాగరాజు ఆ మృతదేహం తన తండ్రి కర్రి కృష్ణ అలియాస్ కొండ కృష్ణదిగా గుర్తించి పోలీసులకు తెలిపాడు. తన తండ్రికి మద్యం అలవాటు ఉందని, తరచూ మాధవదారలోని హిమాలయ బార్లో మద్యం సేవిస్తుంటాడని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కొత్తపాలెం ప్రధాన రహదారిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం 11.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు మూడుగుళ్లు వైపు వెళ్లి, 12.50 గంటలకు ముగ్గురే తిరిగి వచ్చినట్టు గుర్తించారు. ఫుటేజీలోని వ్యక్తుల కోసం హిమాలయ బార్లోని సిబ్బందిని ప్రశ్నించగా వారు గుర్తించారు. కాగా హత్యలో ప్రధాన నిందితుడైన బెండి నారాయణరావు గోపాలపట్నం వీఆర్వో వద్దకు గురువారం ఉదయం వచ్చి నేరం అంగీకరించాడు. నిందితున్ని వీఆర్వో పోలీసులకు అప్పగించగా.. జరిగిన విషయాన్ని తెలిపాడు. కృష్ణకు తనతో వున్న పరిచయంతో తమ ఇంటికి వచ్చిపోయేవాడని, ఈ క్రమంలో తన భార్యతో పరిచయం ఏర్పడిందన్నాడు. దీంతో తన భార్యతో తరచూ గొడవలు జరిగేవని నారాయణరావు చెప్పాడు. అందువల్ల కృష్ణను ఎలాగైనా హతమార్చాలనుకుని తన మిత్రులైన కెల్లి వేణుగోపాలరావు, యమ్మాల చంటితో కలిసి పన్నాగం పన్నామన్నాడు. ఈ నేపథ్యంలో తాము ముగ్గురం కర్రి కృష్ణతో కలిసి మద్యం సేవించామని, ఆ తర్వాత కొత్తపాలెం గ్రామంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుగోలు చేసి మూడుగుళ్లు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోని పొదల మాటుకు వెళ్లామన్నారు. అక్కడ మద్యం సేవించాక వేణుగోపాలరావు తన ఫ్యాంట్ బెల్ట్ తీసి కృష్ణ మెడకు చుట్టి గట్టిగా పట్టుకోగా, నారాయణరావు, చంటి మద్యం సీసాలతో కృష్ణ తలపై కొట్టారని వివరించాడు. కృష్ణ అపస్మారక స్థితికి చేరాక తలపై చంటి రాయితో మోదడంతో మృతి చెందినట్టు తెలిపాడు. నారాయణరావు ఇచ్చిన సమాచారం మేరకు వేణుగోపాలరావు, చంటిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జోన్-2 డీపీసీ కె.ఆనందరెడ్డి అభినందించారు.