పులిని పట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2022-08-08T05:11:07+05:30 IST
ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులిని పట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్చార్జి పీవీజీ కుమార్ విమర్శించారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్
కె.కోటపాడు, ఆగస్టు 7: ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులిని పట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్చార్జి పీవీజీ కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన ఆర్లి గ్రామంలో పర్యటించారు. పులి సంచారంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పులి సంచారంతో వ్యవసాయం, కూలీ పనులు మానుకుని ఇంట్లో అలమటిస్తున్నామని స్థానికులు కుమార్కు తెలిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. నెలల తరబడి పులి సంచారంతో అర్లి, కింతాడ, చింతపాలెం, చంద్రయ్యపేట గ్రామస్థులు భయాందోళనలతో జీవిస్తున్నా, వైసీసీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టేయినా లేదని విమర్శించారు. ఈ గ్రామాల్లో భూములు స్థానిక కొండల పక్కన ఉండడంతో అక్కడకు రైతులు వెళ్లలేకపోతున్నారన్నారు. మూగ జీవాలపై దాడులు చేసి వాటిని చంపేయడంతో ఆ గ్రామాలకు చెందిన ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. సాగు వదులుకోవడంతో ఉపాధి కరువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గానికి చెందిన గ్రామాల్లో పులి సంచరిస్తున్నా ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు పులి సమస్యపై శ్రద్ధ తీసుకోవడం లేదని మండిపడ్డారు. పులి నుంచి పశువులు, ప్రజలకు ప్రాణ రక్షణ కల్పించాలని, పులిని పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పీవీజీ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన వెంట తెలుగు రైతు అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు గొల్లవల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కశిరెడ్డి అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ సబ్బవరపు రామునాయుడు, టీడీపీ నాయకులు జూరెడ్డి రాము, కక్కల చెంచునాయుడు, బండారు దొరబాబు, బండారు రాజుపాత్రుడు ఉన్నారు.