పవర్‌ కెనాల్‌ గండి పూడ్చివేత పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-20T00:26:13+05:30 IST

డొంకరాయి పవర్‌ కెనాల్‌ గండి పూడ్చివేత పనులను సోమవారం ప్రారంభించామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

పవర్‌ కెనాల్‌ గండి పూడ్చివేత పనులు ప్రారంభం
డొంకరాయి వపర్‌ కెనాల్‌కు గండి పడిన ప్రదేశాన్ని చదును చేస్తున్న దృశ్యం

మూడు వారాల్లో పూర్తయ్యేలా ప్రణాళిక

జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌ వెల్లడి

సీలేరు, డిసెంబరు 19: డొంకరాయి పవర్‌ కెనాల్‌ గండి పూడ్చివేత పనులను సోమవారం ప్రారంభించామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొంకరాయి పవర్‌ కెనాల్‌ 3/6 రీచ్‌లో ఏర్పడిన గండి పూడ్చివేత పనులను జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. సోమవారం పూర్తిస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయని, ముందుగా గండి పడిన ప్రదేశమంతా చదును చేసే పనులను ఎక్స్‌కవేటర్‌తో చేపట్టామన్నారు. మూడు వారాల్లో పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించామని, సీలేరు కాంప్లెక్స్‌లోని ఇంజనీరింగ్‌ సిబ్బంది పర్యవేక్షణలో నాణ్యతా లోపాలు తలెత్తకుండా కెనాల్‌ గండి పూడ్చివేత పనులను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

గండి వల్ల నష్టం లేదు

పవర్‌ కెనాల్‌కు గండి వల్ల ఏపీ జెన్‌కో ఆదాయానికి నష్టమేమీ లేదని ఆయన తెలిపారు. విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగానే, లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఆదేశాల మేరకు సీలేరు కాంప్లెక్స్‌లో ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు. సీలేరు కాంప్లెక్స్‌కు ఆధారమైన బలిమెల, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గోదావరి డెల్టా రబీ పంటల కోసం డొంకరాయి జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నామన్నారు. డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి పడినా, పడకపోయినా గోదావరి డెల్టాల రబీ పంటల కోసం విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గిస్తున్నామని, అందువల్ల డొంకరాయి కెనాల్‌కు గండి వల్ల ఏపీ జెన్‌కోకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-20T00:26:18+05:30 IST