మృత్యు మార్గం...

ABN , First Publish Date - 2022-12-07T00:53:04+05:30 IST

నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి (ఆశీల్‌మెట్ట-డీఆర్‌ఎం కార్యాలయం)పై మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.

మృత్యు మార్గం...

మహారాణిపేట, డిసెంబరు 6: నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి (ఆశీల్‌మెట్ట-డీఆర్‌ఎం కార్యాలయం)పై మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. కంచరపాలేనికి చెందిన నీలం జగదీష్‌ (19) మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై సంపత్‌ వినాయకుని ఆలయం వైపు నుంచి కంచరపాలెం వైపు వెళుతూ డివైడర్‌పైనున్న పూలకుండీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో జగదీష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అతి వేగంతో వాహనం అదుపుతప్పి వుంటుందని భావిస్తున్నారు.

ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి..

ఇదే తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం మీద నుంచి జారిపడి మరో యువకుడు మృతిచెందాడు. రాజమండ్రికి చెందిన చిందాడ సూర్య బాలసుబ్రహ్మణ్యం (25) విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో టిఫిన్‌ కోసమని తన స్నేహితుడికి చెందిన ద్విచక్ర వాహనంపై సంపత్‌ వినాయకుడి గుడి వైపు నుంచి రైల్వే స్టేషన్‌ వైపు వెళుతుండగా వాహనం స్కిడ్‌ కావడంతో కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యంను అక్కడున్న వారు కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T00:53:21+05:30 IST