జలపాతం రోడ్డు బురదమయం
ABN , First Publish Date - 2022-10-17T06:23:00+05:30 IST
మండలంలోని యర్రవరం జలపాతం రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు స్థాని కులు, పర్యాటకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
యర్రవరం వెళ్లాలంటే కష్టాలు
పర్యాటకులకు తప్పని ఇబ్బందులు
చింతపల్లి, అక్టోబరు 16: మండలంలోని యర్రవరం జలపాతం రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు స్థాని కులు, పర్యాటకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యర్రవరం జలపాతానికి ఆనుకుని సుమారు పది గిరిజన గ్రామాలున్నాయి. జలపాతానికి వెళ్లే పర్యాటకులు, ఆ ప్రాంత ఆదివాసీలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో చిన్నపాటి మట్టిరోడ్డు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో నాలుగు చక్రాల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. స్థానికులు, పర్యాటకులు ద్విచక్ర వాహనాల్లో, కాలినడకన రాకపోకలు సాగించేవారు. తాజాగా ఈ మార్గానికి మిషన్ కనెక్టు పాడేరులో భాగంగా గ్రావెల్ రోడ్డు మంజూరైంది. దీంతో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ రహదారికి ఇరువైపులా కాలువలు తీసి, ఎర్ర మట్టి వేశారు. అయితే జీఎస్‌టీ(వెట్‌మిక్స్) వేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయమైంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు బురదలో చిక్కుకుపోతున్నాయి. పాద చారులు నడవడానికి అవకాశం లేకుండా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారిపై జీఎస్‌టీ(వెట్‌మిక్స్)వేయాలని ఈ ప్రాంతవాసులు, పర్యాటకులు కోరుతున్నారు.