‘సీడ్స్’ విషవాయువు బాధితులకు పరామర్శల వెల్లువ
ABN , First Publish Date - 2022-08-04T06:47:07+05:30 IST
అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకైన సంఘటనలో అస్వస్థతకు గురై అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో చికిత్సలు పొందుతున్న బాధితులను బుధవారం పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు.
ఎన్టీఆర్ వైద్యాలయానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై ఆరా
మెరుగైన వైద్య అందించాలని మంత్రి అమర్‌నాథ్ ఆదేశం
బాధితులకు ధైర్యం చెప్పిన టీడీపీ, బీజేపీ జనసేన, వామపక్షాల నాయకులు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 3 : అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకైన సంఘటనలో అస్వస్థతకు గురై అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో చికిత్సలు పొందుతున్న బాధితులను బుధవారం పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు. ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వైద్యాలయాన్ని సందర్శించి పలు వార్డుల్లో చికిత్సలు పొందుతున్న బాధితులను పరామర్శించారు. జరిగిన సంఘటన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి.సుభద్ర, వైస్ చైర్‌పర్సన్ బీవీ సత్యవతిలు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ బాధితులను పరామర్శించారు. అదేవిధంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, ఎలమంచిలి ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావులు బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వీరి వెంట పార్టీ నాయకులు బీఎస్‌ఎంకే జోగినాయుడు, దొడ్డి శ్రీనివాసరావు తదితరులున్నారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవీ సత్యనారాయణ, స్థానిక బీజేపీ నాయకులు వైద్యాలయంలోని బాధితులను పరామర్శించారు. జనసేన పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్, పార్టీ నాయకులు తాడి రామకృష్ణ, మళ్ల శ్రీను, శ్రీరామదాసు గోవిందరావు, అప్పికొండ గణేష్, దూలం గోపి తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జిల్లా నాయకులు వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, రాజాన దొరబాబు, వియ్యపు రాజు బాధితులను పరామర్శించారు. సీపీఎం నాయకులు కె.లోకనాథం, ఎ.బాలకృష్ణ, సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, కోటేశ్వరరావు, వీవీ శ్రీనివాసరావులు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వైద్యాలయంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్యాలయం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్ ఆధ్వర్యంలో సీఐలు దాడి మోహన్‌రావు, టి.లక్ష్మి, ఎలియాస్ అహ్మద్ , ఎస్‌ఐలు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.