లక్ష్యం ‘నీరు’గారింది..!

ABN , First Publish Date - 2022-12-15T00:18:52+05:30 IST

గిరిజన విద్యార్థులకు పరిశుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. పాఠశాలల్లో ప్రారంభించిన నెలల్లోనే మరమ్మతులకు గురయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో మూలకు చేరాయి. ప్రస్తుతం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. దీనికితోడు ట్యాపులు, బాత్‌రూములు కూడా నిర్వహణ లేమితో నిరుపయోగమయ్యాయి.

లక్ష్యం ‘నీరు’గారింది..!
గన్నెల పాఠశాలలో మూలకు చేరిన ఆర్వో ప్లాంట్‌

పాఠశాలల్లో అక్కరకురాని ఆర్వో ప్లాంట్లు

మూలకు చేరిన యూనిట్లు

ప్రకటనలకే పరిమితమైన పరిశుద్ధ జలం

ట్యాపులు, బాత్‌రూములదీ అదే దారి!

విద్యార్థుల అగచాట్లు.. పట్టించుకోని అధికారులు

అరకులోయ, డిసెంబరు 14:

నాడు-నేడు మనబడి పథకం కింద ప్రభుత్వం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు పరిశుద్ధమైన జలం అందించాలని పంపిణీ చేసిన ఈ ప్లాంట్‌లు అధికశాతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటిని అందించిన ఏడాది కాకముందే మూలకు చేరడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. నందివలస ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల ఆర్వో ప్లాంట్‌ ప్రారంభించిన తరువాత నెల రోజులు మాత్రమే పనిచేసింది. మరమ్మతుకు గురికావడంతో దీన్ని మూలన పడేశారు. అయిన్పటికీ ఈ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే పాపాన పోలేదని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం చేతులు, తిన్న ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కుళాయి పాయింట్లు కూడా పనిచేయడం లేదు. ఫలితంగా విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వీటిని వినియోగంలోకి తీసుకు రావాలని పలుమార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోతున్నదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోయారు.

అలాగే గన్నెల ప్రాథమిక పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ కూడా పడకేసింది. ఇది పనిచేయకపోవడంతో ఓ స్టోర్‌రూంలో పడేశారు. ఇక్కడ కూడా ట్యాప్‌ పాయింట్లు మొరాయించాయి. అలాగే వెటారు పనిచేయకపోవడంతో మరుగుదొడ్లకు రన్నింగ్‌వాటర్‌ సరఫరా కావడం లేదు. ఈ పాఠశాలలో నాడు-నేడు కింద ఇటీవలే పనులు చేపట్టారు. ఈ పనులపై పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టానుసారంగా నిర్వహించారు. ఫలితంగా ఆర్వో ప్లాంట్‌తో పాటు ట్యాపులు, మోటారు, మరుగుదొడ్లు, ఇతరత్రా పరికరాలు పనిచేయక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావాలని, మోటారు బాగుచేయించి మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-12-15T00:18:55+05:30 IST