‘ఉక్కు’ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం

ABN , First Publish Date - 2022-08-15T06:12:42+05:30 IST

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ సహకరించడం వల్లే ఉక్కు కర్మాగారానికి ఈ దుస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.

‘ఉక్కు’ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం
సత్యాగ్రహ దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

ప్రభుత్వాలకు నూకలు చెల్లే సమయం ఆసన్నమైంది: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి

కూర్మన్నపాలెం, ఆగస్టు 14: కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ సహకరించడం వల్లే ఉక్కు కర్మాగారానికి ఈ దుస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. కూర్మన్నపాలెంలో ఉక్కు కార్మికులు చేపట్టిన సత్యాగ్రహ దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఉద్యోగులు, ఉక్కు నిర్వాసితులు, అన్ని కార్మిక సంఘాల ప్రతినిఽధులు 36 గంటల పాటు దీక్షబూనడం అభినందనీయమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే వుంచాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తాను గతంలో ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు. ఉక్కు కార్మికుల పోరాటాలకు చివరి వరకు టీడీపీ అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ‘ఉక్కు’ను ప్రైవేటీకరిస్తే ఉద్యోగులు, కార్మికులతో పాటు నిర్వాసితులు రోడ్డున పడతారన్నారు. అందువల్ల ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్‌లో గానీ ఎన్‌ఎండీసీలో కానీ విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్‌, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పులి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎవరూ ప్రాణ త్యాగాలు చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులను కేటాయించకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయన్నారు. తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారంపై సీఎం జగన్‌ తన వైఖరిని తెలియజేయాలన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోలేని ప్రభుత్వాలకు నూకలు చెల్లే సమయం ఆసన్నమైందన్నారు. జనసేన నాయకుడు గడసాల అప్పారావు మాట్లాడుతూ ‘ఉక్కు’ అంశాన్ని తమ అధినేత పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లామని, బీజేపీ నాయకులతో చర్చించామన్నారు. కార్మికులకు అండగా జనసేన ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రతినిధి గుడివాడ అమ్మన్న, ఏపీ, తెలంగాణ ఇంటక్‌ ఉపాధ్యక్షుడు జెర్రిపోతుల ముత్యాలు మాట్లాడుతూ బలిదానాలతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొల్లి ముత్యాలునాయుడు, రౌతు శ్రీనివాసరావు, గంగారావు, పులి లక్ష్మీబాయి, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, జె.రామకృష్ణ, కె.పరంధామయ్య, కేఎం శ్రీనివాస్‌, కొమ్మినేని శ్రీనివాస్‌, దొమ్మేటి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.Read more