ఎర్రమట్టి మాఫియా పరార్‌

ABN , First Publish Date - 2022-11-29T03:45:26+05:30 IST

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ నేతల అండతో అక్రమ తవ్వకాల దందా సాగించిన ఎర్రమట్టి మాఫియా తోక ముడిచింది.

ఎర్రమట్టి మాఫియా పరార్‌

జగన్నాథగట్టులో యంత్రాలతో సహా ఖాళీ

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో రంగంలోకి మైనింగ్‌ శాఖ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్రమ తవ్వకాలపై సర్వే

కర్నూలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ నేతల అండతో అక్రమ తవ్వకాల దందా సాగించిన ఎర్రమట్టి మాఫియా తోక ముడిచింది. కర్నూలు నగర శివారున జగన్నాథగట్టు నుంచి రోజూ వందలాది టిప్పర్ల ఎర్రమట్టిని తరలిస్తున్న మాఫియా యంత్రాలతో సహా పరారైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్రమట్టి మాఫియా సాగిస్తున్న అక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ‘కొండల్ని కొల్లగొడుతున్నారు’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర గనులు, భూగర్భ జలవనరుల శాఖ స్పందించింది. ఎర్రమట్టి అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి ఆదేశించారు. మైనింగ్‌ ఏడీ నాగిని, మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీ రాజగోపాల్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలు కర్నూలు నగర శివారున ఉన్న జగన్నాథగట్టుతో పాటు ఆదోని, మంత్రాలయం ప్రాంతాల్లో ఎర్రమట్టి తవ్వకాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. జగన్నాథగట్టు కొండల్లో ఆదివారం రాత్రి వరకు అక్రమ మట్టి తవ్వకాలు సాగాయి. సోమవారం పరిస్థితి మారిపోయింది. భారీ యంత్రాలు, టిప్పర్లు కనిపించలేదు.

ఒక ఎక్స్‌కవేటర్‌ ఉండగా, దాన్నుంచి మట్టి తోడే బకెట్‌ను ఊడదీసుకొని వెళ్లారు. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని వి.నాగిని, రాజగోపాల్‌ చెప్పారు. విజిలెన్స్‌ డీడీ ఆఫీసుకు చెందిన రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఒక బృందం, మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీ ఆఫీసుకు చెందిన మరో బృందం జగన్నాథగట్టులో పరిశీలించారు. ఎంత లోతు, ఎంత వెడల్పుతో ఎర్రమట్టి తవ్వకాలు చేశారో కొలతలు వేశారు. ఒకటి, రెండు రోజుల్లో సర్వే చేసి అంచనా వేయలేమని, పదుల హెక్టార్లలో అక్రమ తవ్వకాలు చేశారని సర్వే చేస్తున్న ఓ అధికారి చెప్పారు. లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టి తరలించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆదోని, మంత్రాలయం, డోన్‌ ప్రాంతాల్లో కూడా మైనింగ్‌ అధికారులు తనిఖీలు చేశారు. కల్లూరు మండలం లక్ష్మీపురం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబరు 793-1లో 590 ఎకరాల విస్తీర్ణంలో జగన్నాథగట్టు ఉంది. ఇక్కడే ఏపీ టిడ్కో ఇళ్లతో పాటు ప్రభుత్వ భవిష్యత్తు అవసరాల కోసం ఉంచిన ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది. ఈ ప్రాంతంలోని కొండల్లో ఉన్న స్వచ్ఛమైన ఎర్రమట్టికి డిమాండ్‌ ఉండడంతో మాఫియా ఎక్స్‌కవేటర్ల ద్వారా అడ్డదిడ్డంగా తవ్వేసింది. వంద ఎకరాల్లో మట్టి తవ్వకాలు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-11-29T03:45:27+05:30 IST