ముగిసిన టీడబ్ల్యూ టీచర్ల బదిలీల ప్రక్రియ

ABN , First Publish Date - 2022-06-28T05:38:07+05:30 IST

ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ సోమవారంతో సజావుగా ముగిసింది.

ముగిసిన టీడబ్ల్యూ టీచర్ల బదిలీల ప్రక్రియ
బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న టీడబ్ల్యూ డీడీ మణికుమార్‌, పక్కన సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి

మూడు రోజుల కౌన్సెలింగ్‌లో 1,472 మందికి స్థాన చలనం


పాడేరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ సోమవారంతో సజావుగా ముగిసింది. ఈ నెల 24, 25, 27 తేదీల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అన్ని కేటగిరీలకు చెందిన 1,472 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగింది. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు సీఏ మణికుమార్‌, టీడబ్ల్యూ పర్యవేక్షకుడు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో స్థానిక అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ నెల 24న తొలి రోజు (శుక్రవారం) ఆశ్రమ పాఠశాలల్లోని గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లు కలిపి మొత్తం 430 మందికి, రెండో రోజు (శనివారం) ఆశ్రమాల్లోని తెలుగు, ఇంగ్లీషు, సైన్సు స్కూలు అసిస్టెంట్లు, హింధీ, తెలుగు పండిట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు కలిపి మొత్తం 454 మందికి బదిలీలు నిర్వహించారు. అలాగే ఆఖరి రోజు సోమవారం ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలకు చెందిన 588 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లను బదిలీ చేశారు. ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ మార్గదర్శకం, ఉపాధ్యాయ సంఘాల సహకారంతో బదిలీల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు సీఏ.మణికుమార్‌ ముగింపు సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యా శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి, ఏటీడబ్ల్యూలు ఎల్‌.రజని, క్రాంతికుమార్‌, చంద్రశేఖర్‌, మల్లికార్జునరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:38:07+05:30 IST