మూడేళ్లుగా సబ్ పోస్టు మాస్టర్ పోస్టు ఖాళీ
ABN , First Publish Date - 2022-10-07T06:07:14+05:30 IST
స్థానిక సబ్ పోస్టాఫీసులోని సబ్ పోస్ట్ మాస్టర్ పోస్టు(ఎస్‌పీఎం) మూడేళ్లుగా భర్తీ కాకుండా ఖాళీగా ఉంది.
పెదబయలు, అక్టోబరు 6: స్థానిక సబ్ పోస్టాఫీసులోని సబ్ పోస్ట్ మాస్టర్ పోస్టు(ఎస్‌పీఎం) మూడేళ్లుగా భర్తీ కాకుండా ఖాళీగా ఉంది. దీంతో దీని పరిధిలో ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని 34 బ్రాంచి పోస్టాఫీసుల పరిధిలో మెరుగైన పోస్టల్ సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సబ్ పోస్ట్ మాస్టర్‌గా పని చేసిన సురేశ్ అనే అధికారిని మూడేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయకుండా ఇన్‌చార్జి, డిప్యూటేషన్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే రెండు మండలాలకు చెందిన పోస్టల్ శాఖలో కీలకమైన సబ్‌పోస్టు మాస్టర్ శాశ్వత అధికారి కాకపోవడంతో ఈ పరిధిలో ఉన్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. ముఖ్యంగా రిజిస్టర్ పోస్టులు, ఇతర పోస్టల్ సేవల విషయంలో సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ సబ్ పోస్టు మాస్టర్ బదిలీ అయిన రెండు లేదా మూడు నెలల్లోనే ఆ పోస్టు భర్తీ చేయాల్సి ఉండగా, పోస్టల్ అధికారి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఏళ్ల తరబడి సబ్ పోస్ట్ మాస్టర్ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. ఇదే అదనుగా సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి స్థానిక సబ్ పోస్టాఫీసులో ఖాళీగా ఉన్న సబ్‌పోస్టుమాస్టర్ పోస్టును భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.