-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The movie Karanam Malleshwari should inspire-NGTS-AndhraPradesh
-
‘కరణం మల్లేశ్వరి’ చిత్రం స్ఫూర్తికావాలి
ABN , First Publish Date - 2022-07-18T06:13:40+05:30 IST
ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ఎందరికో స్ఫూర్తినివ్వాలన్నది తమ లక్ష్యం అని దర్శకురాలు సంజనారెడ్డి తెలిపారు.

దర్శకురాలు సంజనారెడ్డి
సింహాచలం, జూలై 17: ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ఎందరికో స్ఫూర్తినివ్వాలన్నది తమ లక్ష్యం అని దర్శకురాలు సంజనారెడ్డి తెలిపారు. త్వరలోనే హిందీలో కరణం మల్లేశ్వరి, తెలుగులో ‘తిలక్ - 27’ సినిమా నిర్మాణాలు ప్రారంభం కానున్న సందర్భంగా శనివారం ఆమె సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరణం మల్లేశ్వరి చిత్రం భవిష్యత్తులో మరెందరో మల్లేశ్వరిలు తయారయ్యేందుకు దోహదపడుతుందన్నారు. ఒలింపిక్ పతకాల సాధనకు మార్గం అవుతుందని చెప్పారు. దామోదర్ వరప్రసాద్ నిర్మాతగా పూర్తి రాజకీయ, వినోదాత్మక చిత్రంగా ‘తిలక్-27’ రూపొందుతోందని చెప్పారు. ఈ సినిమాకోసం వై.ఎస్.షర్మిల పాదయాత్రలో పాల్గొని అనేక అంశాలు అధ్యయనం చేశానన్నారు. తనది శ్రీకాకుళం జిల్లా అని, టెక్కలిలో పాఠశాల విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడినట్లు తెలిపారు.
కథలు చదవటం హాబీ అని, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రౌడీ’ సినిమాలో సహాయ దర్శకురాలి బాధ్యతలు వహించానన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సొంత కథలతో 27 భాషల్లో చిత్రాలు తీస్తారని చెప్పారు. మనం తీసే హిందీ లేదా కొరియన్ సినిమాలను ఆ దేశాల్లో రీమేక్ చేస్తుంటారని చెప్పారు. సింహాద్రి అప్పన్నస్వామి తమ కుటుంబ ఆరాధ్య దైవమని, తరచూ దర్శనానికి వస్తుంటానని, ఆలయ ప్రాంగణంలో మనసు సేదదీరుతుందని చెప్పారు.