అలా సర్దుబాటు చేసేశారు

ABN , First Publish Date - 2022-12-07T01:34:14+05:30 IST

మండలంలోని జన్నవరం హైస్కూల్‌ స్వీపరు ఆవుపాటి వరలక్ష్మిని తొలగించి ఆ స్థా నంలో అధికార పార్టీ నాయకుల అం డతో స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్యను నియమించడంపై తలెత్తిన వివాదాన్ని ఆ ఊరిపెద్దలు మమ అనిపించేశారు.

అలా సర్దుబాటు చేసేశారు
ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా చేసిన స్వీపరు వరలక్ష్మి (ఫైల్‌)

చోడవరం, డిసెంబరు 6 : మండలంలోని జన్నవరం హైస్కూల్‌ స్వీపరు ఆవుపాటి వరలక్ష్మిని తొలగించి ఆ స్థా నంలో అధికార పార్టీ నాయకుల అం డతో స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్యను నియమించడంపై తలెత్తిన వివాదాన్ని ఆ ఊరిపెద్దలు మమ అనిపించేశారు. తనకు అన్యాయం జరిగిందంటూ ఆం దోళనకు దిగిన స్వీపరు వరలక్ష్మిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామంటూనే, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్యతో కలిసి ఆమె పనిచేసుకోవాలంటూ తీర్పు ఇచ్చే శారు. గ్రామ సర్పంచ్‌, స్కూల్‌ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో రాజీపత్రాన్ని కూడా రాయించేసి ఈ వివాదానికి ముగింపు పలకడం విశేషం. జన్నవరం జడ్పీ హైస్కూల్‌లో ఐదేళ్లుగా స్వీపరు విధులు నిర్వహిస్తున్న ఆవుపాటి వరలక్ష్మిని ఆ పోస్టు నుంచి బలవంతంగా తొలగించి ఆ స్థానంలో అధికార పార్టీ నాయకుడు అయిన స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్య ముచ్చకర్ల మహలక్ష్మిని నియమించడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. స్పీపర్‌ వరలక్ష్మి పేరిట ఉన్న బ్యాంకు అక్కౌంట్‌ నుంచి వరలక్ష్మి పేరును తొలగించి మహలక్ష్మి పేరును చేర్చారు. నాలుగు నెలలుగా వేతనం ఇవ్వకపోవడంతోవేతనం కోసం అడిగిన వరలక్ష్మికి, స్వీపరు పోస్టు నుంచి తొలగించామని, నీ స్థానంలో స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్యను నియమించామని చెప్పడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితిలో ఊరి పెద్దలను ఆశ్రయించింది. అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో వరలక్ష్మి, తన భర్తతో కలిసి గత నెల 28న ఎంఈవో కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. వృద్ధు డైన భర్తతో కలిసి జీవనాధారం తీయ వద్దంటూ ఆమె అధికారులను వేడుకుంది. వరలక్ష్మికి జరిగిన అన్యా యంపై సీఐటీయూ నాయకులు గూనూరు వరలక్ష్మి ఆధ్వర్యంలో చిరుద్యోగులు ఆమెకు న్యాయం చేయాలంటూ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. వరలక్ష్మికి న్యాయం చేయాలంటూ ఏఐటీయూసీ నాయకులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ఈ వ్యవహారం పత్రికల్లో ప్రధానంగా రావ డంతో డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో శ్రీనివాసరావు పాఠశాలలో విచారణ నిర్వహించి అధికారులకు నివేదిక పంపించారు.

రాజీతో వివాదానికి మమ

ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు, సర్పంచ్‌, స్కూల్‌ కమిటీ చైర్మన్‌, ఉపాధ్యాయుల సమక్షంలో సమావేశం నిర్వహించి స్వీపరు పోస్టు విషయంలో గొడవలు లేకుండా స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్య మహలక్ష్మితో పాటు, వరలక్ష్మి కూడా కలిసి పనిచేసుకోవాలని తీర్మానించేశారు. వరలక్ష్మి మరుగుదొడ్లు కడిగేలా, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ భార్య మహలక్ష్మి పాఠశాలల గదులు తుడిచేలా నిర్ణయిస్తూ తీర్పు ఇచ్చేశారు. వచ్చే రూ. 6వేల వేతనం ఇరువురూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించారు. ఈ వివాదంతో గ్రామపరువు పోయినందున భవిష్యత్‌లో గొడవలు పడితే ఇద్దరినీ తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం విశేషం. ఈ వివాదంలో వరలక్ష్మి రోడ్డెక్కినా న్యాయం జరగలేదని, అధికార పార్టీ నేతలు చెప్పిందే న్యాయమైందని ప్రజాసంఘాల నేతలు వాపోతున్నారు.

Updated Date - 2022-12-07T01:34:16+05:30 IST