పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-04-24T07:08:21+05:30 IST

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ తెలిపారు.

పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లాలో 58,256 మంది విద్యార్థులు

బాలురు: 28,588, బాలికలు: 28,082

మొత్తం కేంద్రాలు: 318 

విశాఖ జిల్లాలో 155, అనకాపల్లిలో 122, అల్లూరి జిల్లాలో 41

సమస్యాత్మక కేంద్రాలు: 10

27 నుంచి వచ్చే నెల తొమ్మిది వరకు పరీక్షలు

హాల్‌టికెట్‌ చూపిస్తే బస్సులో ఉచిత ప్రయాణం

విశాఖ డీఈవో చంద్రకళ


ఆరిలోవ, ఏప్రిల్‌ 23: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ తెలిపారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో 318 కేంద్రాల్లో 58,256 మంది పరీక్షలకు హాజరవుతుండగా వారిలో బాలురు 28,588, బాలికలు 28,082 మంది ఉన్నారన్నారు. ఇందుకోసం విశాఖ జిల్లాలో 155, అనకాపల్లి జిల్లాలో 122, అల్లూరి సీతామరాజు జిల్లాలో 41 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణ విధానం మారిందని పేర్కొంటూ అందుకు తగ్గట్టుగానే విద్యార్థులకు సన్నద్ధం చేశామన్నారు. గతంలో అంటే 2019 వరకు మొత్తం 11 పేపర్లు ఉండగా తొలిసారి ఏడు పేపర్లకు విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుందన్నారు. ప్రతిరోజు 3.15 గంటలపాటు విద్యార్థి పరీక్షహాలులో ఉండాలన్నారు. బార్‌కోడింగ్‌ విధానం అమలులో వున్నందున ఉదయం అరగంట ముందే విద్యార్థిని పరీక్ష హాలులోనికి అనుమతిస్తామన్నారు. అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇస్తారని, అందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి జిల్లాలో పది సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి...అక్కడ సిట్టింగ్‌ స్క్వాడ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో పూర్తిస్థాయి ఫర్నీచర్‌ ఏర్పాటుచేశామన్నారు. ప్రతి కేంద్రంలో తాగునీరు ఉంటుందని, విద్యార్థులు సొంతంగా వాటర్‌ బాటిల్స్‌ తెచ్చుకోవచ్చునన్నారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో హాల్‌టికెట్లు చూపితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశామన్నారు. ఫీజులతో సంబంధం లేకుండా హాల్‌టికెట్లు జారీచేయాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను ఆదేశించామని డీఈవో తెలిపారు. 


గదికి 16 మంది

కొవిడ్‌ నిబంధనల అమలుచేస్తున్న నేపథ్యంలో పరీక్షాహాలులో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని నిర్ణయించారు. గదుల విస్తీర్ణం బట్టి 16 నుంచి 24 మందిని  కూర్చోబెట్టనున్నారు. అయితే ఎక్కువచోట్ల 16 మంది వుండేలా ఏర్పాట్లుచేశారు. ప్రతి విద్యార్థి మాస్క్‌, శానిటైజర్‌తో రావాలని నిబంధన ఉంది.  


ఏడు పేపర్లు

పదో తరగతిలో గతంలో పదకొండు పేపర్లు ఉండేవి. ఈ విద్యా సంవత్సరం ఏడు పేపర్లకు కుదించారు. సైన్స్‌ మాత్రమే 50 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. మిగిలిన ఐదు సబ్జక్టులకుగాను ప్రతిరోజు 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పర్యాయం బిట్‌ పేపరు ఉండదు. కాగా కాంపోజిట్‌ తెలుగు సబ్జెక్టు రాసే విద్యార్థులకు మాత్రం పరీక్షలలో తొలిరోజు తెలుగు పేపరు 70 మార్కులకు ఉంటుంది. వీరంతా సాంఘిక శాస్త్రం పరీక్ష ముగిసిన తరువాత రోజున 30 మార్కులకు సంస్కృతం పేపర్‌కు హాజరవుతారు. 

Updated Date - 2022-04-24T07:08:21+05:30 IST