రాజీవ్‌ కాలనీ టిడ్కో ఇళ్ల వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-11-21T00:30:59+05:30 IST

జీవీఎంసీ 56వ వార్డు పరిధి రాజీవ్‌ కాలనీ మురుకువాడలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

రాజీవ్‌ కాలనీ టిడ్కో ఇళ్ల వద్ద ఉద్రిక్తత
సీఐతో మాట్లాడుతున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌

తమకు కేటాయించిన గృహాల్లోకి ప్రవేశించబోయిన లబ్ధిదారులు

అడ్డుకున్న పోలీసులు

కార్పొరేటర్‌ చొరవతో ఎట్టకేలకు గృహప్రవేశాలు

కంచరపాలెం (ఆర్పీపేట), నవంబరు 20: జీవీఎంసీ 56వ వార్డు పరిధి రాజీవ్‌ కాలనీ మురుకువాడలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఇక్కడి మురుకువాడల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మించి కేటాయిచింది. నెల రోజుల క్రితం రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలం సురేశ్‌ ఇక్కడి గృహాల సముదాయాల్ని ప్రారంభించారు. దీంతో లబ్ధిదారులు ఆదివారం తమకు కేటాయించిన ఇళ్లల్లో ప్రవేశించడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ఇక్కడ పేదల కోసం 144 ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ఇందులో 96 డబుల్‌ బెడ్‌రూమ్‌, 48 సింగిల్‌ బెడ్‌రూమ్‌ గృహాలు కాగా 133 మంది లబ్ధిదారులకు ఇప్పటికే కేటాయించిన ఇళ్లను రిజిస్ర్టేషన్‌ చేశారు. లబ్ధిదారులు బ్యాంకుకు లోన్లు కూడా చెల్లిస్తున్నారు. అయితే తమకు కేటాయించిన ఇళ్లను అప్పగించకుండా అధికారులు తాళాలు వేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి తమకు కేటాయించిన ఇళ్లల్లోకి ప్రవేశించడానికి వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం ఇక్కడ నివసిస్తున్న పేదల పాకలు, షెడ్లను అప్పట్లో అధికారులు తొలగించారు. నాటి నుంచి వారంతా ఇక్కడ ముళ్ల పొదల మధ్య తాత్కాళికంగా పాకలు, షెడ్లు వేసుకుని ఉంటున్నారు. పాములు, విష పురుగుల మధ్య ఆవాసం వుంటున్న తరుణంలో ఇటీవల పాము కాటేయడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లల్లో ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారికి కార్పొరేటర్‌ శరగడం రాజశేఖర్‌,మురుకువాడల ప్రజా సంఘాల నాయకురాలు లక్ష్మి అండగా నిలిచారు. అధికారులు, పోలీసులతో చర్చించడంతో ఎట్టకేలకు లబ్ధిదారులు తమ గృహాల్లో ప్రవేశించారు.

Updated Date - 2022-11-21T00:30:59+05:30 IST

Read more