పోర్టు స్టేడియం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-10-17T07:23:35+05:30 IST
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమం వేదిక పోర్టు స్టేడియం వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పవన్‌కల్యాణ్ ‘జనవాణి’ని అడ్డుకునే యత్నం
వైసీపీ, జనసేన కేడర్ పోటాపోటీ నినాదాలు
ఉత్తర వైసీపీ ఇన్చార్జి కేకేరాజు నేతృత్వంలో ఆందోళన
జనసేన కార్యకర్తపై వైసీపీ నేతల దాడి
వైసీపీ కార్యకర్తల అరెస్టు, విడుదల
విశాఖపట్నం/అక్కయ్యపాలెం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమం వేదిక పోర్టు స్టేడియం వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడం, జనసేన కార్యకర్తల ప్రతిస్పందనతో స్టేడియం ప్రధాన గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వైసీపీ కార్యకర్తలను బుజ్జగించిన పోలీసులు ఆ తరువాత అక్కడి నుంచి తరలించి, వెంటనే విడుదల చేశారు. ఇదే సమయంలో ఓ జనసేన కార్యకర్తపై వైసీపీకి చెందిన మహిళానేత దాడిచేశారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా పోర్టు స్టేడియంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అనేకమంది స్టేడియం వద్దకు చేరారు. వారితో పాటు పెద్దఎత్తున జనసైనికులు హాజరయ్యారు. అయితే శనివారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో మంత్రులపై జనసైనికులుగా అనుమానిస్తున్న కొందరు చేసిన దాడికి నిరసనగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల తరువాత విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు జేఏసీ పేరుతో పోర్టుస్టేడియం వద్దకు చేరి పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వివాదం ప్రారంభమయింది. వైసీపీ కార్యకర్తలంతా జేఏసీ జెండాలు పట్టుకుని గేటు ముందు నినాదాలు చేస్తుండం గమనించిన జనసైనికులు గేటులోపల వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. ఈలోగా వైసీపీ ఉత్తర ఇన్చార్జి కేకే రాజు మద్దతుదారులతో సహా స్టేడియం వద్దకు వచ్చి పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పోలీసులు తరలించిన వైసీపీ కార్యకర్తలంతా తిరిగి కేకే రాజు వద్దకు చేరుకున్నారు. జనసేన నాయకులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు వైసీపీ నాయకులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయినా వారు వినకుండా నినాదాలు చేయడంతో తొలుత కేకే రాజును వ్యాన్‌లోకి ఎక్కించగా అతను మరుక్షణమే మళ్లీ అందోళనలోకి వచ్చి కూర్చున్నారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు కేకే రాజుతో పాటు మిగిలిన వారిని అక్కడి నుంచి తరలించారు. ఇదే సమయంలో జనవాణి కార్యక్రమానికి వస్తున్న కార్యకర్త ఒకరు పవన్‌కళ్యాణ్ జై అనగానే వైసీపీ మహిళ అతని షర్ట్టు పట్టుకుని చెంపపై కొట్టడంతో పోలీసులు విడిపించారు.
అనుమతిలేకున్నా ఆందోళన
పోర్టు స్టేడియం ఎదుట వైసీపీ కార్యకర్తల ఆందోళనకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి లేదు. అయినా వైసీపీ కార్యకర్తలు స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. కాగా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వేరే పార్టీవారు ఆందోళన చేస్తే ఈడ్చేసి స్టేషన్‌కు తరలించే పోలీసులు, వైసీపీ కార్యకర్తలను అత్యంత మర్యాదగా చూసుకోవడం దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పవన్‌కు సమస్యలు ఏకరువుపెట్టేందుకు కళావాణి ఆడిటోరియం వద్ద వివిధ ప్రాంతాల వారు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు అడ్డుపడడం, పోలీసులు వారిని వారించకపోవడంతో కార్యక్రమం వాయిదా పడిందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. జనవాణి సందర్భంగా పోలీసులు అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి నాలుగోపట్టణ పోలీస్‌స్టేషన్ సిగ్నల్ వరకు, స్టేడియం ప్రధానద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జనసేన సైనికులకు భరోసా
ప్రమాదాల్లో మృతిచెందిన 12 మంది కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం
ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పంపిణీ
చెక్కులు అందజేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్
విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనవాణి కార్యక్రమం రద్దు కావడంతో ఈ కార్యక్రరమాన్ని ఆదివారం నోవాటెల్‌లో నిర్వహించారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున మొత్తం 12 కుటుంబాలకు ఆయన చెక్కులను అందించారు. వీరిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన తొమ్మిది కుటుంబాలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెండు, విజయనగరం జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి నేతల మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
