ఉపాధ్యాయులను నియమించాలని నిరసన

ABN , First Publish Date - 2022-08-17T06:19:44+05:30 IST

మండలంలోని చిన్నఅగ్రహారం, సప్పర్ల ఎర్రగెడ్డ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.

ఉపాధ్యాయులను నియమించాలని నిరసన
ఉపాధ్యాయుడిని నియమించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తున్న చిన్నఅగ్రహారం విద్యార్థుల తల్లిదండ్రులు

- చిన్నఅగ్రహారం, సప్పర్ల ఎర్రగెడ్డలో టీచర్లు లేక ఇక్కట్లు

- 25 రోజులుగా చదువుకు దూరమైన విద్యార్థులు

- ప్లకార్డులతో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

గూడెంకొత్తవీధి, ఆగస్టు 16: మండలంలోని చిన్నఅగ్రహారం, సప్పర్ల ఎర్రగెడ్డ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. దీంతో విద్యార్థులు పలకలతో, వారి తల్లిదండ్రులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు. మండలంలోని గూడెంకొత్తవీధి పంచాయతీ పరిధిలోనున్న చిన్నఅగ్రహారం గ్రామం జీపీఎస్‌ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే సప్పర్ల ఎర్రగెడ్డ ఎంపీపీ పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. చిన్నఅగ్రహారం, సస్పర్ల ఎర్రగెడ్డ ఎంపీపీ పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై కొంత కాలంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. తాజా బదిలీల్లో వారు పొరుగు మండలాలకు వెళ్లిపోయారు. దీంతో సుమారు 25 రోజులుగా పాఠశాలల్లో విద్యాబోధన జరగడం లేదు. రెండు గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు జీకేవీధి మండల కేంద్రానికి వచ్చి మండల పరిషత్‌, విద్యాశాఖ అధికారులతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించి తమ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అయినా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు. కనీసం సీఆర్‌టీలను కూడా నియమించలేదు. దీంతో మంగళవారం చిన్న అగ్రహారంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. సప్పర్ల ఎర్రగెడ్డ గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాల ఎదుట పలకలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అధికారులు, పాలకులు స్పందించి ఇప్పటికైనా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2022-08-17T06:19:44+05:30 IST