టీచర్ల బదిలీల్లో గందరగోళం

ABN , First Publish Date - 2022-12-15T01:09:37+05:30 IST

డీఈవో కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేస్తున్న ఉపా డీఈవో కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేస్తున్న ఉపా

టీచర్ల బదిలీల్లో గందరగోళం
డీఈవో కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

పోటోరైటప్‌ (14ఏకెపి 1):

ఉత్వర్వుల్లో అనేక లోపాలు

విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలపై అభ్యంతరం

ఆందోళన బాటలో ఉపాధ్యాయ సంఘాలు

అనకాపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్వర్వుల్లో అనేక లోపాలు ఉన్నాయని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదున్నర నెలలు గడిచిపోయింది. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు అర్ధ సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇటువంటి సమయంలో బదిలీల ప్రక్రియ చేపడితే విద్యార్థులు ఇబ్బంది పడతారని అంటున్నారు. సర్వీసు రూల్స్‌ పాటించకుండా బదిలీల ప్రక్రియ చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా బదిలీ ఖాయమని భావించే ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే పాఠాల బోధనపై దృష్టిపెట్టకుండా కాలం గడిపేస్తారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అనకాపల్లి జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 6,280 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బదిలీలకు ‘జీరో’ సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గతంలో కోరుకున్న చోటకు బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఇప్పుడు బదిలీకి ఆసక్తి చూపరు. మొత్తం మీద రెండు వేల మంది వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు వున్నాయని జిల్లా విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు.

బదిలీల ఉత్తర్వుల్లో లోపాలు...

ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు పాటించడంలేదంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. బదిలీల ఉత్తర్వుల్లో పలు లోపాలు వున్నాయని అంటున్నారు. 2021 జనవరిలో చేపట్టిన బదిలీల కౌన్సెంగ్‌లో కొత్త పాఠశాలలో చేరి, ఇప్పుడు హేతుబద్ధీకరణలో స్థానం(పోస్టు) కోల్పోతున్న ఉపాధ్యాయులందరికీ హేతుబద్ధీకరణ పాయింట్స్‌, పాత పాఠశాలల్లో పనిచేసిన కాలానికి స్టేషన్‌ పాయింట్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ విధానాలైన సింగిల్‌ మీడియం, సెక్షన్ల పెంపుదల వల్ల హేతుబద్ధీకరణ ఏర్పడిందని గుర్తించకుండా బదిలీలకు సిద్ధపడడం సరికాదన్నది ఉపాధ్యాయుల వాదన.

ఈ ఏడాది అక్టోబరులో ప్రమోషన్ల కోసం ఒప్పంద పత్రాలు ఇచ్చిన ఉపాధ్యాయులందరినీ ప్రమోషన్‌ కేడర్‌లోనే బదిలీలు చేయాలి. కానీ అలా కాకుండా సాధారణ బదిలీలు చేపట్టడం ఎంతవరకు సమంజసంమని ప్రశ్నిస్తున్నారు. అలాగే సబ్జక్టు కన్వర్షన్‌ ఒప్పంద పత్రాలు ఇచ్చిన పీఎస్‌(ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెచ్‌ఎంలు, ఇతర సబ్జక్టు టీచర్ల గురించి ఈ బదిలీల ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు.

డీఈవో పూల్‌లో ఉన్న భాషా పండితులు, ఇతర సబ్జక్టు టీచర్లకు వారి పాత పాఠశాలలో సర్వీసు పాయింట్స్‌ ఇస్తూ స్థిరమైన స్థానాల్లోకి బదిలీ చేయాలి. కానీ అలా కాకుండా సాధారణ బదిలీల్లో కలిపేశారు.

ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్స్‌ ఇవ్వకుండా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బదిలీ ఉత్తర్వుల్లో లోపాలను సవరించకపోతే ఆందోళనలను మరింత ఉధతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Updated Date - 2022-12-15T01:09:48+05:30 IST