ఉపాధ్యాయుల సర్దుబాటు

ABN , First Publish Date - 2022-12-02T01:25:48+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా సర్దుబాటు ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చింది.

ఉపాధ్యాయుల సర్దుబాటు

ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి...

యూపీ నుంచి ఉన్నత పాఠశాలల్లోకి...

మిగులు ఉన్న చోట్ల నుంచి సబ్జక్టు టీచర్‌ల కొరత ఉన్న చోటకు

డిప్యుటేషన్‌పై పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు

ఉమ్మడి జిల్లాలో తెలుగు, హిందీ, ఆంగ్లం ఉపాధ్యాయుల కొరత

ప్రస్తుతానికి బదిలీలు లేనట్టేనంటున్న ఉపాధ్యాయ వర్గాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా సర్దుబాటు ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చింది. పాఠశాలల్లో ఎక్కడైనా అవసరం కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్టయితే...వారిని సబ్జక్టు టీచర్ల కొరత వున్న ఉన్నత పాఠశాలలకు డిప్యుటేషన్‌ విధానంలో పంపాల్సిందిగా ఆదేశించింది. పాఠశాలల విలీనం నేపథ్యంలో మూడు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు స్కూలు అసిస్టెంట్లతో బోధన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సరిపడా సబ్జక్టు టీచర్లు లేకపోతే సమీపంలోని యూపీ పాఠశాలల నుంచి స్కూలు అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై ఉన్నత పాఠశాలలకు పంపాలి. యూపీ పాఠశాలల్లో బోధనకు సమీపంలో ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌లను (ఎస్జీటీలు) నియమించాలని ఆదేశాలు వచ్చాయి. శుక్రవారంలోగా ఈ సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగు, హిందీ, ఆంగ్లం ఉపాధ్యాయుల (స్కూలు అసిస్టెంట్లు) కొరత ఎక్కువగా వుందని అధికారులు గుర్తించారు. పాఠశాల విద్యా శాఖ ఇచ్చిన నివేదిక మేరకు ఉమ్మడి జిల్లాలో అన్ని సబ్జక్టులు కలిపి 531 ఖాళీలు చూపించారు. అయితే రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలుకానందున పాఠశాల విద్యా శాఖ ఇచ్చిన జాబితాను పరిగణనలోకి తీసుకోలేమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 248 ఉన్నత పాఠశాలల్లోకి 262 ప్రాథమిక పాఠశాలలు, 14 యూపీ పాఠశాలల నుంచి మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులను తరలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థిఃటీచర్‌ నిష్పత్తి మేరకు రేషనలైజేషన్‌ చేపడితే 65 గణితం, 14 ఫిజికల్‌ సైన్స్‌, 28 బయాలజీ, 144 సోషల్‌ స్టడీస్‌ టీచర్‌ పోస్టులు (స్కూలు అసిస్టెంట్‌ కేటగిరీ) మిగులుతాయని అంచనా వేశారు. అదే సమయంలో 30 తెలుగు, 47 హిందీ, 136 ఆంగ్లం, 125 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు కొరత వుందని గుర్తించారు. దీంతో మిగులు వున్న సబ్జక్టుల నుంచి కొరత వున్న సబ్జక్టులకు పోస్టులను కన్వర్ట్‌ చేయాలనుకున్నారు. అయితే రేషనలైజేషన్‌ అమలు చేయనందున ఆ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌ వస్తే రేషనలైజేషన్‌ విధానం అమలు చేయాలని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రేషనలైజేషన్‌, బదిలీలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో సబ్జక్టు టీచర్ల కొరతపై దృష్టిసారించింది. ఉమ్మడి జిల్లాలో మిగులు వున్న పాఠశాలల నుంచి కొరత వున్న పాఠశాలలకు సబ్జక్టు టీచర్లను సర్దుబాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో తెలుగు, హిందీ, ఆంగ్లం సబ్జక్టులకు సరిపడా స్కూలు అసిసెంట్లు లేరు. మూడు నెలల క్రితం 133 ఆంగ్ల ఉపాధ్యాయులకు (స్కూలు అసిస్టెంట్లు) పదోన్నతులు కౌన్సెలింగ్‌ నిర్వహించినా బదిలీలు లేనందున వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు. అయితే పదోన్నతి పొందిన ఆంగ్లం ఉపాధ్యాయులకు అనధికారికంగా ఉన్నత పాఠశాలల్లో విధులు అప్పగించే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాలల్లో విలీనమైన 3, 4, 5 తరగతులకు కూడా స్కూలు అసిస్టెంట్లతో బోధన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి స్కూలు అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో ఎంతమందిని సర్దుబాటు చేస్తారనేది శుక్ర, శనివారాల్లో తేలనున్నది. అయితే ఈ ప్రక్రియ జరిగినా తెలుగు, హిందీ సబ్జక్టులకు టీచర్ల కొరత ఇంకా వుంటుందని అంటున్నారు.

- టీచర్ల కొరత ఎదుర్కొంటున్న పాఠశాలలు..

ఎండాడ సమీపంలోని వాడపాలెం ఉన్నత పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తెలుగు, హిందీ, గణితం స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం హిందీకి ఒకరిని నియమించారు. గణితం బోధనకు టీచర్‌ లేకపోవడంతో పదో తరగతి పిల్లలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పద్మనాభం మండలం పాండ్రంకి ఉన్నత పాఠశాలలో 195 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం గణితానికి స్కూలు అసిస్టెంట్‌ ఒక్కరే ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజికల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌లకు స్కూలు అసిస్టెంట్లు అసలు లేరు.

Updated Date - 2022-12-02T01:25:49+05:30 IST