Anitha comments: గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు?:
ABN , First Publish Date - 2022-08-11T18:40:42+05:30 IST
పోలీస్ వ్యవస్థతో అసత్యాలు చెప్పించే పరిస్థితికి వచ్చారని టీడీపీ నేత వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విశాఖపట్నం: పోలీస్ వ్యవస్థతో అసత్యాలు చెప్పించే పరిస్థితికి వచ్చారని టీడీపీ (TDP) నేత వంగలపూడి అనిత (Vangalapudi anita) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వీడియోలో ఉన్నది గోరంట్ల (Gorantla madhav) కాదని ఎస్పీ స్పష్టంగా చెప్పలేదన్నారు. రికార్డింగ్ చేసిన వీడియో తీసుకురావాలని ఎస్పీ చెబుతున్నారని... అయితే గోరంట్ల మాధవ్ (YCP MP) ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాధవ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఫోరెన్సిక్ విభాగం చెప్తోందన్నారు. గోరంట్ల మాధవ్‌ను ఎలాగైనా కాపాడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ వ్యవహారంపై గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామన్నారు. గోరంట్ల మాధవ్‌ను బర్తరఫ్ చేసేవరకు తమ పోరాటం ఆగదని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.