అనుమతులు లేకుండా మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపనా?

ABN , First Publish Date - 2022-12-31T01:38:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే బూటకపు హామీలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటే రాజకీయం ఏమైపోతుందో అర్ధం కావడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు.

అనుమతులు లేకుండా   మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపనా?
పాములవాకలో విలేకర్లతో మాట్లాడుతున్న అనిత

కోటవురట్ల, డిసెంబరు 30 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే బూటకపు హామీలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటే రాజకీయం ఏమైపోతుందో అర్ధం కావడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం సీఎం నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో కోటవురట్ల మండలం పాములవాకలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పరదాలచాటున, పోలీసు బందోబస్తు నడుమ నర్సీపట్నం చేరుకున్నారన్నారు. మెడికల్‌ కళాశాల వస్తే అందరికీ మంచిదేనని, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని మెడికల్‌ కాలేజీకి నర్సీపట్నంలో ముఖ్యమంత్రి శంకుస్థానప చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏడు మెడికల్‌ కాలేజీలకు అనుమతి కోసం పంపిస్తే, వాటిలో నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ పేరులేదని ఆమె ఆరోపించారు. మూడున్నరేళ్లలో ఒక్కసారీ ప్రత్యేక హోదా కోసం మాట్లాడని సీఎం జగన్‌, నర్సీపట్నంలో ఈ అంశంపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ను తిట్టడానికి వేదిక కావాలి కాబట్టి, బస్సుల్లో జనాలను తీసుకు వచ్చి తిండుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, జానకి శ్రీనివాసరావు, పెట్ల లింగంనాయుడు, వేచలపు జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:38:38+05:30 IST