సీఎం జగన్ మోసపూరిత పాలన
ABN , First Publish Date - 2022-12-31T01:37:18+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత పాలన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు.
బుచ్చెయ్యపేట, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత పాలన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. శుక్రవారం రాత్రి వడ్డాదిలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెంచిన విద్యుత్, బస్సు చార్జీలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తాతయ్యబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిందని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పండుగ కానుకలను రద్దు చేసిందని విమర్శించారు. చంద్రబాబుతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గునూరు మల్లునాయుడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, టీడీపీ మండలఅధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావు, పార్టీ నాయకులు దొండా నరేష్, దొడ్డి కిషోర్, డొంకిన అప్పలనాయుడు, వియ్యపు అప్పారావు, అక్కిరెడ్డి కనకారావు పాల్గొన్నారు.
భయంతో గడుపుతున్న పేదలు
దేవరాపల్లి, డిసెంబరు 30: ఏ పథకాన్ని ఎప్పుడు తీసేస్తారో తెలియక పేదలు భయంతో గడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి మామిడిపల్లిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. అనంతరం రామానాయుడు మాట్లాడుతూ, ఆడిట్ పేరుతో పింఛన్ల రద్దుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. కందుకూరి ఘటనను మానవత్వంతో చూడకుండా వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయడానికి యువత నడం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కల వెంకటరావు, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, పెద్దాడ వెంకటరమణ, కొప్పాక కాసుబాబు, రామలింగస్వామి, జగన్, కిల్లి గోవింద తదితరుల పాల్గొన్నారు.