మరో స్వగృహలా స్మార్ట్ టౌన్‌షిప్‌లు?
ABN , First Publish Date - 2022-12-15T01:08:36+05:30 IST
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో విశాఖపట్నంలో ఫ్లాట్లు, భీమునిపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాలు నిర్మిస్తామంటూ దరఖాస్తులు, వాటితో పాటు రూ.5 వేల డిపాజిట్ స్వీకరించారు. అయితే అనకాపల్లి, భీమిలిలో భూమి అందుబాటులో లేదని చేతులు ఎత్తేశారు. ఒక్క విశాఖపట్నంలోనే ఎండాడలో ‘అద్రజ’ పేరుతో ప్రాజెక్టు చేపట్టారు.
స్వగృహ: రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎండాడలో రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు కేటాయించిన భూమి. దీనిని ప్రస్తుత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.
వైఎస్ హయాంలో మధ్య తరగతికి విశాఖపట్నం, భీమిలి, అనకాపల్లిల్లో ఇళ్లు నిర్మిస్తామంటూ దరఖాస్తులు స్వీకరణ
డిపాజిట్‌గా రూ.ఐదేసి వేలు సేకరణ
ఒక్క ఇల్లు కూడా నిర్మించని వైనం
ఇప్పటికీ దరఖాస్తుదారులకు వెనక్కి రాని స్వగృహ సొమ్ములు
ఆ ప్రాజెక్టు కోసం ఎండాడలో గుర్తించిన భూమి
బల్క్‌లో అమ్మకానికి ఇటీవల ప్రభుత్వం యత్నం
ఇప్పుడు మళ్లీ ప్రతి నియోజకవర్గంలోను
‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్’ పేరుతో ఎంఐజీ లేఅవుట్లు వేసేందుకు ఏర్పాట్లు
పట్టణాలకు దూరం..ధరలు చూస్తే అధికం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో విశాఖపట్నంలో ఫ్లాట్లు, భీమునిపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాలు నిర్మిస్తామంటూ దరఖాస్తులు, వాటితో పాటు రూ.5 వేల డిపాజిట్ స్వీకరించారు. అయితే అనకాపల్లి, భీమిలిలో భూమి అందుబాటులో లేదని చేతులు ఎత్తేశారు. ఒక్క విశాఖపట్నంలోనే ఎండాడలో ‘అద్రజ’ పేరుతో ప్రాజెక్టు చేపట్టారు. రెండేళ్లు కింద మీద పడినా ఒక్క గృహం కూడా నిర్మించలేకపోయారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎండాడలో ఆ భూములను ఎకరాల లెక్కన అమ్ముకోవడానికి యత్నిస్తున్నారు. అవి మధ్య తరగతికి కేటాయించినవని, వారి కోసమే అక్కడ గృహాలు నిర్మించాలని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలావుండగా రాజీవ్ స్వగృహ కోసం సేకరించిన డిపాజిట్లు...ఇంకా చాలామందికి వెనక్కి ఇవ్వలేదు.
ఇప్పుడు అదే తీరు
తండ్రి మార్గంలోనే తనయుడు కూడా మళ్లీ మధ్య తరగతి ప్రజలపై వల వేశారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలోను ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్’ పేరుతో ఎంఐజీ లేఅవుట్ వేసి, మార్కెట్ రేటు కంటే తక్కువకు స్థలం ఇస్తామని ప్రకటించారు. ఇందుకు అవసరమైన భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ సేకరించి ఇస్తే, వీఎంఆర్‌డీఏ లేఅవుట్ వేసి, ధర నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఆసక్తి కలిగినవారు కొనుక్కోవచ్చు. అందులో ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ ఇస్తారు. ఏ జిల్లాకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్లు భూసేకరణ బాధ్యత తీసుకున్నారు. అయితే వారు ప్రభుత్వ భూములు కాకుండా పేదల ఆక్రమణల్లో ఉన్నవి, అసైన్డ్ భూములు సేకరించి, వీఎంఆర్‌డీఏకు ఇస్తున్నారు. అభివృద్ధి చేసిన దాంట్లో కొన్ని ప్లాట్లు ఇస్తామని ఆక్రమణదారులకు హామీ ఇస్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు నగర పరిధిలోనే ఉండడం, భూమి అందుబాటులో లేకపోవడంతో అందరికీ కలిపి ఆనందపురం మండలంలో నాలుగు లేఅవుట్లు (పాలవలస, రామవరం, గంగసాని అగ్రహారం-1, 2) వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే మార్కెట్ ధర కంటే తక్కువకు ఇస్తామని చెప్పి, ఎక్కడా లేని ధరలు నిర్ణయించారు. దాంతో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. కనీసం ఎంక్వయిరీలు కూడా రాలేదు. అనేక సమీక్షలు, విమర్శల తరువాత కళ్లు తెరిచిన అధికారులు వారం క్రితం ధరలు గజానికి రూ.4 వేలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయా లేఅవుట్లలో ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడం గమనార్హం.
అనకాపల్లి జిల్లాలో...
అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి మొదట చోడవరం నియోజకవర్గం పరిధిలోని అడ్డూరులో 20 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. అది అటు చోడవరానికి దగ్గర కాదు. అలాగని సబ్బవరానికి సమీపాన లేదు. ఎటు చూసినా 12 కి.మీ. దూరం. పైగా ఆ ప్రాంతంలో ఇప్పటికే ప్రైవేటు సంస్థ రూపొందించిన లేఅవుట్ ఉంది. ధర కూడా అందుబాటులోనే ఉంది. దాని వెనుక మామిడి తోటలున్న భూమిలో వీఎంఆర్‌డీఏ అధికారులు లేఅవుట్ వేస్తున్నారు. అక్కడ ఇంకా చెట్లు తొలగించలేదు. గజం రూ.6,500గా నిర్ణయించారు. అక్కడ రిజిస్ర్టేషన్ విలువ వ్యవసాయ భూమి ధర ఎకరా రూ.16.5 లక్షలు. అదే ఇళ్ల స్థలం అయితే గజం రూ.1,300. దీనికి రెండింతలు బహిరంగ మార్కెట్ ధర ఉంటుంది. అంటే గజం రూ.4 వేల వరకు పలుకుతుంది. అటువంటిచోట అందుబాటు ధరలో అని చెప్పి గజం రూ.6,500గా నిర్ణయించారు. అంటే ప్రభుత్వ రిజిస్ర్టేషన్ ధరకు నాలుగు రెట్లు, బహిరంగ మార్కెట్ ధరకు 50 శాతం ఎక్కువ రేటు పెట్టారు. పైగా నివాసాలకు దూరం. ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఇక జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో భూమి ఇంకా సేకరించలేదు. పెందుర్తిలో 40 ఎకరాలు సేకరించారు. ఆ భూమికి ముందు మరికొంత భూమి వుండడంతో దానిని కూడా కలిపితే రోడ్డు కలిసి వస్తుందని ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇక ఎలమంచిలి నియోజకవర్గంలోని చోడపల్లిలో 43 ఎకరాలు సేకరించి లేఅవుట్ అప్రూవల్ కోసం అమరావతిలోని డీటీసీపీకి పంపించారు. నర్సీపట్నంలో 35 ఎకరాలు సేకరించారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. పాయకరావుపేట, మాడుగులలో భూమి అందుబాటులో లేదు.
పార్టీ నేతల వ్యాపారానికి అనువుగా
వైసీపీలో చాలామంది నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఈ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు భూసేకరణలో వారి ప్రమేయం అధికంగా ఉంటోంది. వారికి లబ్ధి చేకూరే విధంగానే అధికారులు భూములు ఎంపిక చేసి, వారు చెప్పినట్టే ప్లాట్ల రేట్లు కూడా నిర్ణయిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.