తుఫాన్ పంట నష్టంపై నేటి నుంచి సర్వే
ABN , First Publish Date - 2022-12-16T00:54:49+05:30 IST
మాండస్ తుఫాన్ ప్రభావంతో వరి పంటకు వాటిల్లిన నష్టంపై శుక్రవారం నుంచి సర్వే నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయాల సిబ్బంది బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. దెబ్బతిన్న పంటను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తారు. ఐదు రోజుల్లో సర్వే పూర్తిచేసి ఈ నెల 21న ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా వరి కోతలు పూర్తయి, వర్షాలకు పనలు తడిసిపోయి నష్టం వాటిల్లితే ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించదని, కోత కోయని పొలాల్లో 33 శాతానికి మించి పంట దెబ్బతింటేనే ఇన్పుట్ సబ్సిడీ (నష్ట పరిహారం) వర్తిస్తుందని స్పష్టం చేశారు.
వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది బృందాలుగా ఏర్పాటు
క్షేత్రస్థాయిలో వరి పొలాల పరిశీలన
21న ప్రభుత్వానికి నివేదిక
కోత కోయని వరి పంటకు 33 శాతం కంటే ఎక్కువ నష్టం వాటిల్లితేనే పరిహారం
అనకాపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
మాండస్ తుఫాన్ ప్రభావంతో వరి పంటకు వాటిల్లిన నష్టంపై శుక్రవారం నుంచి సర్వే నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయాల సిబ్బంది బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. దెబ్బతిన్న పంటను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తారు. ఐదు రోజుల్లో సర్వే పూర్తిచేసి ఈ నెల 21న ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా వరి కోతలు పూర్తయి, వర్షాలకు పనలు తడిసిపోయి నష్టం వాటిల్లితే ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించదని, కోత కోయని పొలాల్లో 33 శాతానికి మించి పంట దెబ్బతింటేనే ఇన్పుట్ సబ్సిడీ (నష్ట పరిహారం) వర్తిస్తుందని స్పష్టం చేశారు.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.39 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. మాండస్ తుఫాన్‌కు ముందు సుమారు 14 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో మిగిలిన రైతులు సుమారు వారం పాటు వరి కోతలు వాయిదా వేసుకున్నారు. కాగా తుఫాన్‌కు ముందు వరి కోతలు పూర్తిచేసి, కుప్ప వేయని పొలాల్లో వర్షాల కారణంగా వరి పనలు తడిసిపోయాయి. లోతట్టు భూముల్లో నీట మునిగి ధాన్యం రంగుమారడం, మొలకెత్తడం వంటివి జరిగాయి. పంట కోత కోయని పొలాల్లో ఈదురు గాలులకు పైరు నేలవాలింది. నీరు అధికంగా నిలిచిన భూముల్లో వరి దుబ్బులు తడిసిపోయి, కంకులు కుళ్లిపోయాయి. వ్యవసా య శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పొలాల్లో పర్యటించి వరి పంటను కాపాడుకోవడానికి రైతులకు పలు సూచనలు చేశారు. కాగా పంటనష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా పలువురు అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి నష్టంపై సర్వే
ప్రభుత్వ ఆదేశాల మేరకు మాండస్ తుఫాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయాల సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. వీరు శుక్రవారం నుంచి తమకు కేటాయించిన గ్రామాల్లో వరి పొలాలను పరిశీలిస్తారు. ఎంత మేర పంట నష్టం వాటిల్లిందో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తించి నమోదు చేసుకుంటారు.
కోత కోయని పంటకే నష్టపరిహారం
- బి.మోహన్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
తుఫాన్ వర్షాల వల్ల వరి పంటకు నష్టం వాటిల్లిందని, వచ్చి పరిశీలించాలని పలు మండలాల రైతుల నుంచి వినతులు అందాయి. శుక్రవారం నుంచి పంట నష్టంపై సర్వే చేయిస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోత కోసి, పనలమీద ఉన్న పంటకు నష్టం వాటిల్లితే పరిహారం వుండదు. కోత కోయకుండా నీట మునిగిన పంటకు మాత్రమే నష్ట పరిహారం వస్తుంది. అది కూడా మూడోవంతు కన్నా ఎక్కువ పంట దెబ్బతింటేనే! నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తి చేసి 2వ తేదీన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతాము.