రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ABN , First Publish Date - 2022-05-26T05:24:41+05:30 IST
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు.

కలెక్టర్ ఎ.మల్లికార్జున
విశాఖపట్నం, మే 25: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రవాణా సదుపాయాలు మెరుగుపరిచి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల గుంతలకు ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేయాలని, ముఖ్యంగా బీఆర్‌టీఎస్ రోడ్డులో కాన్వెంట్ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు ఉన్న గోతులు కప్పాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు సూచించినట్లు జిల్లాలో 80 చోట్ల ఉన్న బ్లాక్ స్పాట్‌లు పరిశీలించి అవసరమైన హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా షీలానగర్-సబ్బవరం రోడ్డు పనుల ప్రగతి అడిగి తెలుసుకున్నారు. వెంకోజిపాలెం-హనుమంతవాక మధ్య హైవేపై వర్షం కురిసినప్పుడల్లా భారీగా నీరు చేరుతున్నందున అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీటీసీ రాజరత్నం, పోలీసు, జీవీఎంసీ, హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.