ఉక్కు విలవిల
ABN , First Publish Date - 2022-08-12T06:35:57+05:30 IST
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు పరిస్థితి మరింత దిగజారింది.

ఓ వైపు పెరిగిన ఉత్పత్తి వ్యయం
మరోవైపు ఎగుమతులపై పన్ను విధించడంతో ధరల పతనం
రూ.90 వేల నుంచి రూ.70 వేలకు తగ్గిన టన్ను ధర
కేంద్రం ఆదుకోకుంటే కోలుకోవడం కష్టమే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు పరిస్థితి మరింత దిగజారింది. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణపై అధికారులు, కార్మికులు ఓ వైపు పోరాడుతుంటే...మరోవైపు ముడి పదార్థాలు అందుబాటులో లేక ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఉత్పత్తుల ఎగుమతులపై 15 శాతం పన్ను విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో నష్టాలకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. దాంతో ఎగుమతులు నిలిపివేశారు. పోనీ దేశీయ మార్కెట్లో అమ్ముకుందామని అనుకుంటే...వర్షాలు మొదలు కావడంతో నిర్మాణ పనులు మందగించాయి. అన్ సీజన్ కావడంతో డిమాండ్ పడిపోయింది. దాంతో ధరల పతనం మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టన్ను రూ.90 వేలు వున్న విశాఖ ఉక్కు ధర ఇప్పుడు రూ.70 వేలు ఉంది. అంటే ఐదు నెలల కాలంలో టన్నుకు రూ.20 వేలు పడిపోయింది. ఉత్పత్తి వ్యయం మాత్రం తగ్గలేదు. ఇతర స్టీల్ప్లాంట్లతో పోల్చుకుంటే విశాఖ స్టీల్ ముడిపదార్థాలు అన్నింటిని బహిరంగ మార్కెట్లో పోటీ పడి కొనుగోలు చేసుకోవలసి వస్తోంది. ఐరన్ ఓర్ గనులు లేవు. కోల్ సరఫరా తగ్గిపోయింది. కోకింగ్ కోల్ తీసుకువచ్చిన నౌకలకు పూర్తి మొత్తం చెల్లించకపోవడంతో అన్లోడింగ్ జరగక డెమరేజీ కట్టాల్సి వస్తోంది. వీటన్నింటి ఫలితంగా ఉత్పత్తి 60 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. నిల్వలు గతంలో కనీసం మూడు లక్షల టన్నులు ఉండేవి. ఇప్పుడు అవి 1.7 లక్షల టన్నులకు తగ్గిపోయాయి.
సాయం కోసం ఢిల్లీలో ప్రయత్నం
ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు కోలుకోవాలంటే...కేంద్రం ఎంతో కొంత సాయం చేయాల్సిందేనని అధికారులు, కార్మికులు నొక్కి వక్కాణిస్తున్నారు. కనీసం రూ.5 వేల కోట్లు సర్దుబాటు చేస్తే తప్ప గండం నుంచి గట్టెక్కలేమని అంటున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని, ఎన్నడూ ఉచితంగా తీసుకోలేదని అధికారులు గుర్తుచేస్తున్నారు. లేదంటే టన్నుకు రూ.5 వేలు చొప్పున ఇన్సెంటివ్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటు ఉన్నతాధికారులు ఢిల్లీలో ఇదే పనిలో వున్నారని కార్మిక వర్గాలు తెలిపాయి.
ఏసీ శాంతిపై విచారణ
ఎర్నిమాంబ ఆలయంలో అడ్డగోలు నియామకాలపై ఆర్జేసీ ఆరా
విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా, ఎర్నిమాంబ ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన కాళింగిరి శాంతిపై రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ సురేశ్‌బాబు విచారణ నిర్వహించారు. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ఆయన...ఎర్నిమాంబ ఆలయంలో నడిచిన అడ్డగోలు వ్యవహారాలపై బాధితులను, అధికారులను పిలిచి ఆరా తీశారు. శాంతి ఆ ఆలయానికి ఈఓగా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కమిషనర్‌కు ఫిర్యాదు వెళ్లింది. అర్హులు కాని వారిని పూజారిగా నియమించి, ఆయనతో భక్తులకు తీర్థం ఇప్పించేవారని విచారణలో తేలింది. సదరు వ్యక్తికి ఎటువంటి జీతం ఇవ్వకుండా భక్తులు సమర్పించిన దక్షిణలో వాటా ఇచ్చేవారని నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా మరో ఇద్దరిని డే టైమ్ వాచ్‌మెన్‌గా, ఇంకొకరిని ప్రసాదాల విక్రయానికి నియమించినట్టు ఆరోపణలు వచ్చాయి. అవి కూడా నిజమని విచారణలో తేలింది. ఇకపోతే ఆ ఆలయంలో పనిచేసే ఉద్యోగి చనిపోవడంతో ఆయన భార్య పదేళ్లుగా అక్కడ అమ్మవారికి సేవలు చేస్తోంది. తనను రెగ్యులర్ చేయిస్తానని నాటి ఈఓ కొంత మొత్తం తీసుకున్నట్టు కమిషనర్‌కు ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దానిపై కూడా ఆర్జేసీ విచారణ చేశారు. ఆమెను ప్రస్తుతం విధుల నుంచి తొలగించినట్టు ప్రస్తుత ఈఓ సురేశ్ తెలపగా, స్వీపర్‌గా తీసుకోవాలని విచారణ అధికారి సూచించినట్టు తెలిసింది.
అక్కడా అవే ఆరోపణలు
శాంతి కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించిప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. తమకు మాట మాత్రం చెప్పకుండా పీఆర్ఓగా సీలేరుకు చెందిన వ్యక్తిని నియమించారని, అది నిబంధనలకు విరుద్ధమని ట్రస్టు బోర్డు సభ్యులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తరువాత వచ్చిన ఈఓ ఆ పీఆర్ఓను తప్పించేశారు. ఇదే కనకమహాలక్ష్మి దేవస్థానానికి ఈఓగా మళ్లీ రావాలని శాంతి అమరావతిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఆర్జేసీ విచారణ జరపడం చర్చనీయాంశమైంది.
ఈఓ నివేదిక కోరాము: సురేశ్‌బాబు, ఆర్జేసీ
కమిషనర్ ఆదేశం మేరకు శాంతిపై విచారణ చేశాము. బాధితులను, ఆలయ ఉద్యోగులను పిలిచి మాట్లాడాము. ప్రస్తుత ఈఓ నివేదిక కోరాము. ఆ ప్రకారం కమిషనర్‌కు అన్ని వివరాలను అందజేస్తాము.
