అధ్యక్షా... అంత అన్యాయమా??

ABN , First Publish Date - 2022-09-17T06:47:15+05:30 IST

విశాఖపట్నంపై వైసీపీ నాయకులు మాటల్లో చూపించే ప్రేమను...చేతల్లో చూపించాలని స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అధ్యక్షా... అంత అన్యాయమా??

ఉక్కు కర్మాగారం సమస్యను ప్రస్తావించడం ఏమైనా నేరమా

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోకపోవడమేమిటని అసెంబ్లీలో ప్రశ్నించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు

ఆ విషయం మాట్లాడవద్దని వారించిన స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌

ఏమైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తామని హెచ్చరిక

ఇదేనా విశాఖపై ప్రేమ..!!

భగ్గుమంటున్న నగరవాసులు, కార్మిక సంఘాలు


విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంపై వైసీపీ నాయకులు మాటల్లో చూపించే ప్రేమను...చేతల్లో చూపించాలని స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నగరాన్ని పరిపాలనా రాజధాని చేసి, ఎక్కడికో తీసుకువెళతామంటూ ప్రచారం చేసుకుంటున్నవారు...విశాఖ ఉక్కు సమస్యను అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రస్తావిస్తే...స్పీకర్‌ అడ్డుకోవడం ఎందుకుని ప్రశ్నిస్తున్నాయి. 

రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో భాగంగా కడపకు వచ్చిన స్టీల్‌ప్లాంటు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆ ప్లాంటు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు అధికంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటివరకు...అసలు వారికి పరిహారమే ఇవ్వలేదని ఆరోపించారు. శంకుస్థాపన చేయడమే తప్ప...ఎటువంటి నిర్మాణం పనులు జరగడం లేదని విమర్శించారు. అక్కడ ఆ స్టీల్‌ప్లాంటును నిర్మించక, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ‘విశాఖ  ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నా పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. దీనిపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తీవ్రంగా స్పందించారు. కడప స్టీల్‌ప్లాంటు గురించే మాట్లాడాలని, విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు గురించి మాట్లాడితే...వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మాట్లాడే అవకాశం కూడా కోల్పోతారని స్పష్టంచేశారు. ఇదంతా టీవీల్లో చూసిన విశాఖపట్నం వాసులు, స్టీల్‌ప్లాంటు కార్మికులు...స్పీకర్‌ తీరును ఆక్షేపిస్తున్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 500 రోజులకు పైగా పోరాడుతున్నామని, అదేమీ అధికార పార్టీకి పట్టదా? అని స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సమస్యను ప్రస్తావిస్తే...అసలు మాట్లాడడానికే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని, ఇదేనా విశాఖ ప్రజలకు అధికార పార్టీ చేసే న్యాయమని మండిపడుతున్నారు. స్టీల్‌ప్లాంటు విశాఖలో భాగం కాదా?, వైసీపీ నాయకులు అలా అనుకుంటున్నారా? అని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.


పరిష్కారం చూపినా స్పందన శూన్యం

కడప స్టీల్‌ప్లాంటు, విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు రెండింటికీ ఉపయోగపడే మార్గాలను విశాఖ స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ మూడేళ్ల క్రితమే అధికార పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. అనకాపల్లి ఎంపీ ద్వారా సీఎం జగన్‌కు అందజేసింది. ఆ విధంగా చేస్తే రెండింటికీ మేలు జరుగుతుందని, అతి తక్కువ వ్యయంతో మూడేళ్లలో కడప స్టీల్‌ప్లాంటు ప్రారంభం కావడంతో పాటు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని, ఇటు విశాఖ స్టీల్‌ పాంట్లు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతుందని వారు అందులో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు. దాంతో రెండూ నష్టపోతున్నాయి.


ఇదీ మేలు చేసే ఆలోచన

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఐరన్‌ఓర్‌ గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం, విస్తరణకు చేసిన అప్పులపై వడ్డీల రూపేణా ఏడాదికి రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతోంది. స్టీల్‌ తయారీలో విశాఖ ఉక్కుకు ఎంతో నైపుణ్యం, పేరు ఉన్నాయి. దానిని కడప స్టీల్‌ప్లాంటుకు ఉపయోగించుకోవాలనేది ప్రణాళిక. కడపలో రెండు మిలియన్‌ టన్నుల పెల్లటైజేషన్‌ ప్లాంటు, ఒక మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన స్పెషల్‌ గ్రేడ్‌ రోలింగ్‌ మిల్లు మొదటి దశలో ఏర్పాటుచేయాలి. దీనికి రూ.4 వేల కోట్లు సరిపోతాయి. పెల్లెట్ల తయారీకి రాష్ట్రంలోని ఐరన్‌ఓర్‌ సరిపోతుంది. కడపలో తయారైన పెల్లెట్లను విశాఖ స్టీల్‌ తీసుకొని బిల్లెట్లు తయారుచేస్తుంది. వాటిని తిరిగి కడప ప్లాంటుకు సరఫరా చేస్తే...అక్కడ రోలింగ్‌ మిల్లు ద్వారా స్పెషల్‌ గ్రేడ్‌ స్టీల్‌ తయారుచేసుకోవచ్చు. ఇవన్నీ మూడేళ్లలో పూర్తయిపోతాయి. అంతా కలిపితే రూ.5 వేల కోట్లతో అయిపోతుంది. దీని ద్వారా కడపలో ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది. దశల వారీగా అభివృద్ధి చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకేసారి అక్కడ స్టీల్‌ప్లాంటు నిర్మించాలంటే...రూ.15 వేల కోట్ల వరకు అవసరం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో అంత మొత్తం పెట్టలేరు కాబట్టి కేవలం రూ.5 వేల కోట్లు పెడితే...కడప ప్లాంటు ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో కడప స్టీల్‌ప్లాంటులో తయారైన పెల్లెట్లను స్టీల్‌ప్లాంట్‌ కూడా వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని తద్వారా సమస్యల నుంచి గట్టెక్కుతుందని విశాఖ స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ లెక్కలేసి మరీ చెప్పింది. దీనికి ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు కడపలో నిర్మాణమూ మొదలు కాలేదు. ఇటు విశాఖ స్టీల్‌ సమస్య తీరలేదు. ఇప్పటికైనా ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని విశాఖ స్టీల్‌ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. 

Updated Date - 2022-09-17T06:47:15+05:30 IST