స్పందన అర్జీలకు తక్షణ పరిష్కారం
ABN , First Publish Date - 2022-04-19T06:31:09+05:30 IST
స్పందనలో ప్రజలు అందజేసిన అర్జీలను లోతుగా పరిశీలించి, త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశం
జిల్లాస్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయండి
స్పందనలో 108 అర్జీలు
స్వయంగా స్వీకరించిన కలెక్టర్, జేసీ
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 18: స్పందనలో ప్రజలు అందజేసిన అర్జీలను లోతుగా పరిశీలించి, త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 80 మంది జిల్లాస్థాయి అధికారులు స్పందనకు హాజరవుతు న్నారని, ఈ కార్యక్రమంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. అర్జీ పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది? ఒకవేళ పరిష్కారం చేయడానికి వీలుకాకపోతే కారణాలు ఏమిటి? అన్నది అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. జిల్లాస్థాయి అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేసి, అందులో అందరూ చేరాలని, అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
స్పందనలో 104 అర్జీలు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి స్వయంగా అర్జీలను స్వీకరించి, బాధితుల గోడు ఆలకించారు. అనంతరం అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ వివాదాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరు, ఇళ్లు రుణాలు కోరుతూ అర్జీలు అందజేశారు. మొత్తం 104 అర్జీలు అందగా, ప్రతి అర్జీదారునికి రశీదు అందజేశారు.
అనకాపల్లి బైపాస్ రోడ్డు నుంచి తోటాడ మీదుగా పరవాడ వెళ్లే రహదారిని విస్తరించాలని గవర్ల అనకాపల్లి గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రస్తుతం 10 అడుగుల వెడల్పు మాత్రమే వున్న ఈ రహదారిలో వాహనాల రాకపోకలు అధికం కావడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రహదారిని 80 అడుగులకు విస్తరించాలని కోరారు.
అనకాపల్లి మండలం బాటజంగాలపాలెంలో దశాబ్దాల నుంచి పేదల సాగులో ఉన్న భూమిని ఇళ్ల స్థలాలకు సమీకరణలో భాగంగా చదును చేశారని, సాగుదారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం నాయకులు నిరసన తెలియజేసి కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.