అన్ని పంటల విత్తనాలు పంపిణీ చేయాలి
ABN , First Publish Date - 2022-07-06T06:47:55+05:30 IST
రైతు భరోసా కేంద్రాల ద్వారా రబీలో పొద్దు తిరుగుడు విత్తనాలు సరఫరా చేయకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల అన్ని రకాల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలని ఒంపోలు రైతులు జేసీ కల్పనాకుమారిని కోరారు.

జేసీ కల్పనాకుమారికి రైతులు వినతి
మునగపాక, జూలై 5: రైతు భరోసా కేంద్రాల ద్వారా రబీలో పొద్దు తిరుగుడు విత్తనాలు సరఫరా చేయకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల అన్ని రకాల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలని ఒంపోలు రైతులు జేసీ కల్పనాకుమారిని కోరారు. ఆమె మంగళవారం ఒంపోలు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఖరీఫ్‌కు విత్తనాల పంపిణీ ప్రారంభమైందని, రైతులు తమ పంటల వివరాలను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. చెరకు పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ కావడంతో ప్రత్యామ్నాయంగా వరి పంట వేస్తున్నారని, ధాన్యానికి మద్దతు ధర పెంచేలా చూడాలని రైతులు బొద్దపు శ్రీరామ్మూర్తి, తాతబ్బాయి, నరాలశెట్టి తాతారావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి లీలావతి, ఏడీఏ ఎం.రామారావు, మండల ఏవో జోత్స్నకుమారి, కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.
‘సేవలు అందని ఆర్బీకేలు ఎందుకు?’
అచ్యుతాపురం రూరల్: ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు మంగళవారం మండలంలోని తిమ్మరాజుపేటలో ‘గడప గడపకు...’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ, ఆర్బీకేల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ ధర చెల్లించి బయట షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, రైతులకు సేవలు అందించని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించారు. అసలైన అర్హులకు కాకుండా వైసీపీ వాళ్లకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మహిళలు ఆరోపించారు. జగనన్న చేదోడు పథకానికి తన భార్య ఎంపికైనప్పటికీ రాజకీయ కారణాలతో సహాయం మంజూరు చేయలేదని టీడీపీ కార్యకర్త కర్రి వెంకునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ దేశంశెట్టి శంకరరావు, నాయకులు కోన బుజ్జి, మారిశెట్టి సూర్యనారాయణ, కూండ్రపు వెంకునాయుడు పాల్గొన్నారు.