క్రమబద్ధీకరణకు ససేమిరా!
ABN , First Publish Date - 2022-08-04T06:52:04+05:30 IST
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద గుర్తించిన భూముల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీక రణతో రూ.కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేటు నిర్ణయించి ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే దీనికి కనీస స్పందన రాకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో పడిపోయింది.
యూఎల్‌సీ గడువు ముగిసినా ముందుకు రాని వైనం
రిజిస్ట్రేషన్ రేటు కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా చెల్లించలేమంటున్న ఆక్రమణదారులు
తలలు పట్టుకుంటున్న అధికారులు
గడువు పెంపు యోచనలో ప్రభుత్వం
రిజిస్ట్రేషన్ విలువ తగ్గింపు దిశగా చర్యలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద గుర్తించిన భూముల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీక రణతో రూ.కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేటు నిర్ణయించి ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే దీనికి కనీస స్పందన రాకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో పడిపోయింది.
నగరంలో యూఎల్‌సీ భూముల నుంచి సుమారు రూ.400 కోట్లు లభిస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ఆక్రమణదారుల నుంచి జూన్ నెలాఖరు వర కు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకోసం ఒక్కరు కూడా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌కు ఆసక్తి చూపలేదు... సరికదా రిజిస్ట్రేషన్ శాఖ నిర్ధారించిన రేటుకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ చెల్లించి క్రమబద్ధీకరించుకోలేమని తెగేసి చెబుతున్నారు. దీనికితోడు క్రమబద్ధీకరణ నోటీసులు తీసుకునేందుకు కూడా ససేమిరా అంటున్నారు. నగరంలోనే కాకుండా రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతా ల్లో కూడా క్రమబద్ధీకరణకు స్పందన లేకపోవడంతో ప్రభు త్వం కంగుతింది. ఇందుకు కారణాలు ఏంటి? అని జిల్లా యంత్రాంగం నుంచి వివరాలు కోరే ప్రయత్నం చేయడంతో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, ప్రజల నుంచి వ్యతిరేక తను వారు నివేదించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఎవరూ సిద్ధంగాలేరని కుండబద్దలుకొట్టారు. దీంతో కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా ఖజానాకు భారీగా నిధులు సమీకరించాలని యోచిస్తున్న ఉన్నతాధికారులు ఏం చేయాలో పాలుపోక తలలుపట్టుకుంటున్నారు. తాజాగా మరింత గడువు పెంచాలని భావిస్తున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ విలువపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించి, సగానికి తగ్గించాలన్న దిశగా కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.
అధికారుల నుంచి సమాచార సేకరణ
దీనిపై విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో అధికారుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఉన్నతస్థాయిలో చర్చించిన తరువాత అధికారికంగా ఉత్తర్వులు విడుదలచేయనున్నారు. కాగా విశాఖ నగరంలో మొత్తం 3,861 మంది ఆక్రమణదారులకు గాను మార్చిలో 1,531మందికి నోటీసులు ఇచ్చారు. వీరిలో 75 చదరపు గజాలలోపున్న ఆక్రమణదారులు 701 మందికి, 150 చ.గ.లోపు 335 మంది, 300 చ.గ.లోపు 461 మంది, 300 చదరపు గజాలు దాటిన 86 మంది ఉన్నారు. వీరంతా 35 హెక్టార్లలో నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన 51 హెక్టార్ల భూముల్లో ఉన్న 1,442 మందికి నోటీసులు జారీచేయాల్సి ఉంది. అయితే రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై ఆక్రమణదారుల్లో అవగాహన పెరగడంతో మిగిలిన వారంతా నోటీసులు తీసుకోలేదు. ఆక్రమణల క్రమబద్ధీకరణకు నోటీసులు తీసుకున్న 1,531మందిలో ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్‌కు ముందుకురాలేదు. ఆక్రమణదారుల నుంచి వ్యతిరేకత రావడంతో నోటీసులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు కూడా జంకుతున్నారు. కాగా జూన్ నెలాఖరుతో ముగిసిన గడువు పెంపుకోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.